Site icon Swatantra Tv

పార్టీ మారడం లేదు – ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కారు దిగి కాషాయ గూటికి, కాంగ్రెస్‌ ఒడికి చేరుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడంతో.. బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందనే ప్రచారం మొదలైంది. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా గులాబీ పార్టీని వీడుతారనే ప్రచారం మొదలైంది. ఆ జాబితాలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్లు ఉండడం గమనార్హం. తాజాగా.. త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందంటూ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి మాత్రమే కాదు.. ఇంకా పలువురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారంటూ జోష్యం చెప్పారు.

కాగా.. బీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలను గులాబీ నేతలు కొట్టి పారేశారు. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పని చేస్తానన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు. బీజేపీలోకి వెళ్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. బీఆర్ఎస్ కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. క్యాడర్ అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని ఎర్రబెల్లి సూచించారు. వైఎస్సార్ ఎన్నో ఇబ్బందులు పెట్టినా తాను పార్టీ మారలేదని చెప్పారు.

తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారాన్ని ఖండిచారు మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. తాను పార్టీ మారడం లేదని బీఆర్ఎస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్వలాభం కోసం కొందరు ఇతర పార్టీలో చేరుతున్నారని చెప్పారు.

Exit mobile version