Site icon Swatantra Tv

పది రాష్ట్రాల్లో నామినేషన్ల జాతర

     సార్వత్రిక ఎన్నికల్లో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. నాలుగో దశ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణతోపాటు మొత్తం 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోపక్క ఎన్నికల పర్వంలో మొదటి అంకమైనా నామినేషన్ల జాతర కూడా షురూ కావడంతో ర్యాలీలు, ప్రత్యేక పూజలతో ఎన్నికల కోలాహాలం నెలకొంది.

    దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. నాల్గవ విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది ఈసీ. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం ఏపీలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, తెలంగాణలో 17 పార్లమెంట్, సికింద్రా బాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మే13న పోలింగ్ జరగనుంది. ఏపీతోపాటు ఒడిశా, అరుణా చల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల తోపాటు బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌, జమ్మూకశ్మీర్‌.. రాష్ట్రాల్లో మొత్తం 96 లోక్‌సభ స్థానాలకు నాల్గవ దశలో ఎన్నికలు పూర్తికాను న్నాయి.

     ఇక ఎన్నికల పర్వంలో మొదటి ఘట్టమైన నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. దీంతో కొందరు ఇవాళ నామినేషన్లు వేయనుండగా, మరికొందరు ముహూర్తాలు వెతుక్కుంటున్నారు. ఇక నేతల నామినేషన్లతో పెద్ద ఎత్తున ర్యాలీలు, ప్రత్యేక పూజలతో ఎన్నికల సందడి నెలకొంది. ఇక సెలవు దినాలు మినహా మిగిలిన రోజుల్లో ఈ నెల 25 వరకూ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఆ తర్వాత రోజు 26 నుంచి నామినేష‌న్ల‌ను ప‌రిశీలన ఉంటుంది. ఏప్రిల్ 29న నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ముగుస్తుంది.

 నామినేషన్ల ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానం రిటర్నింగ్‌ ఆఫీసు కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వేయవచ్చు. ఒక అభ్యర్థి ఏదైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీచేసే అవకాశముంది. ఎంపీ అభ్యర్థి అయితే ఫారం–2ఏ, ఎమ్మెల్యే అభ్యర్థయితే ఫారం–2బీ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక లోక్‌స‌భ‌కు పోటీ చేసే అభ్య‌ర్థులు 25 వేల రూపాయలు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు 10 వేల ధ‌రావ‌త్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులు ఇందులో 50 శాతం చెల్లిస్తే స‌రిపోతుంది. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయనున్నారు. ఇక నామినేషన్ల ప్రక్రియ పూర్తవగానే మే 13న పోలింగ్ జరగననుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఫలితాల విడుదలతో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలిపోతుంది.

Exit mobile version