ఇవాళ్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు హ్యాట్రిక్ కొట్టి మూడవసారి కేంద్రంలో కొలువుదీరిన మోదీ సర్కార్.. తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. మార్చిలో మధ్యంతర బడ్జెట్‌తో ఆగిపోయిన బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను పెట్టేందుకు రెడీ అయింది. ఆగష్ట్ వరకూ కొనసాగనున్న ఈ సమావేశాల్లో రేపు పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే సభా ఆమోదం కోసం కేంద్రం 6 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇందులో విపత్తు నిర్వహణ చట్ట సవరణ బిల్లు, ఆర్థిక బిల్లు, 1934 ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయుయన్ విధేయక్ – 2024 బిల్లు, బాయిలర్స్ బిల్లు, కాఫీ బిల్లు, రబ్బరు బిల్లులు ఉన్నాయి.
మరోపక్క ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన నీట్ పేపర్ లీకేజీ, వరుస రైలు ప్రమాదాలు, ఇతర అంశాలపై మోదీ సర్కారును నిలదీసేందుకు రెడీ అయింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో.. ప్రభుత్వ వాటాను 51 శాతం కన్నా తక్కువకు తగ్గించుకునే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీకి పలు అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలని ఎడిటర్ గిల్డ్ విజ్ఞప్తి చేసింది.
నీట్ వివాదంతోపాటు రైల్వే భద్రత, కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని ఐక్యంగా నిలదీయాలని విపక్షం భావిస్తోంది. సంప్రదాయాన్ని అనుసరించి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. ఇదే అంశాన్ని అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ ప్రస్తావించింది. బడ్జెట్ సమావేశాల కార్యాచరణపై చర్చించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ భేటీలో… 44 పార్టీల నుంచి 55 మంది నేతలు హాజరై తమ డిమాండ్లు వినిపించారు. పార్లమెంట్‌లో తమకు గొంతు వినిపించే అవకాశం ఇస్తామన్న భరోసా కల్పించాలని వారు కోరారు.
ఏపీ, బిహార్, ఒడిశాలకు ప్రత్యేక హోదా కల్పించాలని ఆ రాష్ట్ర పార్టీలు డిమాండ్ చేశాయి. కావడి యాత్ర అంశాన్ని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ ప్రస్తావించారు. కీలకమైన 24 శాఖలకు సంబంధించి స్టాయీ సంఘాలను ఏర్పాటు చేయాలని, వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. మంత్రులతో ఎంపీలు నేరుగా చర్చించేందుకు వీలుగా సంప్రదింపుల కమిటీలను పునరుద్ధరించాలని కోరారు.