Site icon Swatantra Tv

సకల హంగులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవంతిని ప్రారంభించనున్న ప్రధాని

స్వతంత్ర వెబ్ డెస్క్: దేశ రాజధాని నడిబొడ్డున అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవంతిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం ఏడున్నరకు ప్రారంభమయ్యే కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. న్యూఢీల్లీ మొత్తాన్ని నియంత్రిత ప్రాంతంగా ప్రకటించి, ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వీఐపీలు, ఎంపీలు, సందర్శకులకు వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జరిపించకపోవడానికి నిరసనగా దాదాపు 20 విపక్షాలు దీనిని బహిష్కరించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే విపక్షాల నిర్ణయంపై భాజపా మండిపండుతుంది.

ఇంకా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని రెండు దశలుగా నిర్వహిస్తున్నారు. ఉదయం 7.30 గంటలకు పూజ కార్యక్రమం ఉంటుంది. ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సహా పలువురు సీనియర్‌ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 8:30గంటలకు ప్రధాని, ప్రముఖులు పార్లమెంట్ ను సందర్శిస్తారు. అనంతరం 9గంటలకు ప్రార్ధన సభ మొదలవుతుంది. ఉదయం 9.30గంటలకు లోక్‌సభ స్పీకర్‌ కుర్చీ కుడి పక్కన రాజదండాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పాటు సెంగోల్‌ రూపకర్తలు సైతం హాజరుకానున్నారు. తరువాత పూజ కార్యక్రమం ఉంటుంది.

తమిళనాడులోని తిరువాదుతురై అధీనంతో సహా 20 ఆధీనాలకు చెందిన మఠాధిపతులు పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథులుగా హాజరవుతున్నారు. తిరువాదుతురై అధీనం మఠాధిపతి ప్రధాని మోదీకి రాజదండాన్ని అప్పగిస్తారు. అనంతరం మఠాధిపతులతో భేటీ అవుతారు మోడీ. ఇక మధ్యాహ్నం జాతీయ గీతాలాపనతో రెండో దశ ప్రారంభ వేడుకలు మొదలుకానున్నాయి. లోక్‌సభ ఛాంబర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా అతిథులు హాజరుకానున్నారు. పార్లమెంట్‌ నిర్మాణం సమయంలోని అనేక ఘట్టాలతో రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తారు. చివరగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌ నుంచి తీసుకువచ్చిన తివాచీలు, త్రిపుర వెదురుతో సిద్ధం చేసిన గచ్చు, రాజస్థాన్‌లో రూపుదిద్దుకున్న శిలాకృతులు.. ఇలా దేశంలో భిన్న సంస్కృతుల మేళవింపుగా భవనాన్ని తీర్చిదిద్దారు. బ్రిటిష్‌ పాలకుల నుంచి అధికారం బదలాయింపునకు చిహ్నంగా తొలి ప్రధాని నెహ్రూ స్వీకరించిన చారిత్రక ‘ఉత్సవ రాజదండం’ (సెంగోల్‌)ను నూతన లోక్‌సభలో స్పీకర్‌ స్థానానికి సమీపంలో నెలకొల్పుతారు. ప్రత్యేకంగా రూపొందించిన రూ.75 నాణేన్ని విడుదల చేస్తారు. టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ నిర్మించిన కొత్త భవనంలో భారీస్థాయి ‘కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌’, ఎంపీల కోసం ఒక లాంజ్‌, గ్రంథాలయం, కమిటీ హాళ్లు, విశాలమైన పార్కింగ్‌ ఏర్పాట్లు ఉంటాయి. త్రికోణాకారంలో నాలుగంతస్తుల్లో నిర్మించిన భవనం మొత్తం వైశాల్యం 64,500 చదరపు మీటర్లు.

Exit mobile version