Site icon Swatantra Tv

ఏపీలో నూతన మద్యం విధానం ఖరారు

ఏపీలో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రెండేళ్ల కాల పరిమితితో నిన్న అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌ 12 నుంచి 2026 సెప్టెంబర్‌ 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3 వేల 396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదలైంది . ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల విభాగంలోకి వచ్చే 6 కులాలకు 340 దుకాణాలు కేటాయించనున్నారు. ఇవాళ ఉదయం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనుంది. ఆన్‌ లైన్‌ లేదా ఆఫ్‌ లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు

ఒక్కో షాపుకు 2 లక్షల చొప్పున నాన్‌ రిఫండబుల్ రుసుము చెల్లించాలి. డెబిట్‌, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. DD తీసుకుని నేరుగా ఎక్సైజ్‌ స్టేషన్లలో అందించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నారు. ఈనెల 11వ తేదీన ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నెల 12 నుంచి లైసెన్సుదారులు కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నడుపుతున్న ప్రభుత్వ మద్యం షాపుల విధానం గడువు ఇవాళ్టితో ముగిసింది. ఈ నేపథ్యంలోనే కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకూ ప్రస్తుతమున్న ప్రభుత్వ దుకాణాలే యధాతథంగా కొనసాగనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్‌ కుమార్‌ మీనా ఐదు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈసారి లైసెన్స్‌ ఫీజులను భారీగా పెంచింది ప్రభుత్వం. జనాభా ప్రాతిపదికన షాపులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. తొలి ఏడాది 10 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు 50 లక్షలు, ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలుగా లైసెన్స్‌ ఫీజును నిర్ణయించారు. రెండో ఏడాది ఈ ఫీజులపై పది శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా ఆరు విడతల్లో లైసెన్స్‌ రుసుము చెల్లించాలి. దీన్ని రిటైల్‌ ఎక్సైజ్‌ సుంకంగా పేర్కొన్నారు. రిటైల్‌ వ్యాపారం చేసే లైసెన్స్‌దారుకు 20 శాతం మేర మార్జిన్‌ ఉంటుంది. నగరపాలక సంస్థల్లో మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాలను మోడల్‌ స్టోర్స్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు నూతన విధానంలో అవకాశం కల్పించారు. ఇందుకు ఏడాదికి 5 లక్షలు చొప్పున అదనంగా లైసెన్స్‌ రుసుము చెల్లించాలి

ప్రస్తుతం నోటిఫై చేసిన 3వేల 396 మద్యం దుకాణాలకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు , కర్నూలు, కడప,అనంతపురాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు. మరోవైపు మద్యం ధరలు తగ్గించారు. 99 రూపాయలకే క్వార్టర్‌ మద్యం లభించేలా MRPలు నిర్ణయించారు. వైసీపీ హయాంలో మద్యంపై 10 రకాల పన్నులు ఉండేవి. వాటిని నూతన మద్యం విధానంలో 6కు కుదించారు. కొత్తగా డ్రగ్‌ కంట్రోల్‌ సెస్‌ విధించారు. ల్యాండెడ్‌ కాస్ట్‌పై 2 శాతం మేర ఈ పన్ను ఉంటుంది. దీని ద్వారా ఏడాదికి 90 కోట్ల నుంచి వంద కోట్ల రూపాయల వరకూ ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.

Exit mobile version