స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే అరెస్టై జైలులో ఉంటున్న సుఖేశ్ చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురించి సంచలన ఆరోపణలు చేస్తూ మరో లేఖ విడుదల చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటిలోని ఫర్నిచర్‌కి కవిత ‘షెల్’ అకౌంట్ల నుంచి డబ్బులు వెళ్లాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయటపెడతానని పేర్కొన్నారు. కవిత ‘షెల్’ కంపెనీల అకౌంట్స్ నుంచి మారిషస్ లోని ఆప్ మంత్రి కైలాష్ గెహ్లాట్ బంధువుల అకౌంట్లకు నగదు బదిలీ అయ్యిందని తెలిపారు.
మొత్తం మూడు విడతల్లో రూ.80 కోట్ల నగదు లావాదేవీలు జరిగాయన్నారు. ఇందుకోసం కేజ్రీవాల్ ఆదేశాలకు సంబంధించిన ఐఫోన్ ఫేస్ టైం చాట్స్ వివరాలను కూడా త్వరలోనే విడుదల చేస్తానని చెప్పారు. వాస్తవాలు బయటపెడుతున్నందుకే తనను తీహార్ జైలు నుంచి ఢిల్లీలోని మండోలీ జైలుకు తరలించారన్నారు. దీంతో జైలులో కేజ్రీవాల్ కు అనుకూలమైన అధికారుల ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశానని హెచ్చరించారు. త్వరలోనే కేజ్రీవాల్ వరుస కుంభకోణాలను బయటపెడతానని సుఖేశ్ చంద్రశేఖర్ వెల్లడించారు.