స్వతంత్ర వెబ్ డెస్క్: దేశ రాజధానిలో కొత్తగా రూపుదిద్దుకున్న పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని రూ.75 నాణేన్ని ముద్రించనున్నారు. పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
నాణేనికి ఒకవైపు జాతీయ చిహ్నాలైన మూడు సింహాలు, మరో వైపు కొత్త పార్లమెంట్ భవనాన్ని ముద్రించారు. నాణేన్ని నాలుగు లోహాలతో తయారు చేయనున్నారు. ఇందులో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ ఉంటాయి. పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం క్రింద ‘2023’ అని రాసి ఉంటుంది.
ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఎన్డీఏ సంకీర్ణ కూటమి 15 భాగస్వామ్య పక్షాలు- హాజరు కానున్నాయి. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతి కారీ మోర్చా, రాష్ట్రీయ లోక్ జన్‌శక్తి పార్టీ, అప్నా దళ్ (సోనేలాల్), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, తమిళ మానిల కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, మిజో నేషనల్ ఫ్రంట్, నాయకులు ఇందులో పాల్గొననున్నారు.
దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తటస్థంగా వ్యవహరిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బిజూ జనతాదళ్, శిరోమణి అకాలీదళ్.. కూడా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించాయి. గతంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండి, ఆ తరువాత ప్రతిపక్షాలతో జట్టు కట్టి.. ఇప్పుడు మళ్లీ బీజేపీకి చేరువ కావడానికి ప్రయత్నిస్తోన్న తెలుగుదేశం పార్టీ సైతం ఈ కార్యక్రమానికి హాజరుకానుంది.