Site icon Swatantra Tv

నారా..నందమూరి నారీ మణుల ఎన్నికల ప్రచార పర్వం

    నందమూరి ఆడపడుచులు, నారా వారి కోడళ్లు ఎన్నికల పోరులోకి దిగారు. తండ్రీకొడుకులకు మద్దతు గా అత్తాకోడళ్లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇన్నాళ్లు,.. ఇన్నేళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ లేడీస్‌ ఈ సారి మాత్రం తమదైన స్టైల్‌ని ప్రదర్శిస్తున్నారు. ఒకరు భర్తకు బదులు నానినేషన్‌ వేస్తే.. మరొకరు తన పతి కోసం ప్రజలతో మమేకమయ్యారు. మరి వీరి శకునం కలిసొస్తుందా..? పూజలు ఫలిస్తాయా..? ప్రచారం పని చేస్తుందా..?

    ఏపీలో ఎన్నికల పోరు నువ్వా నేనా అన్న రేంజ్‌లో అధికార పార్టీ వైసీపీ, విపక్ష కూటమి మధ్య హోరాహోరీగా సాగుతోంది. జగన్‌ను గద్దె దించడమే టార్గెట్‌గా తెలుగు దేశం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంటే.. మేముసైతం అంటూ నందమూరి ఇంటి ఆడపడుచులు, నారా వారి కోడళ్లు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఈసారి ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్‌ వేశారు. నామినేషన్ దాఖలుకు ముందు భువనేశ్వరి కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురంలోని మసీదులో,.. బాబు నగర్‌లోని చర్చిలో ప్రార్థనలు జరిపించారు. ఆ తర్వాత భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమిలోని బిజెపి, జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక నామినేషన్ ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన భువనేశ్వరి వైసీపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని, రాష్ట్రం సర్వనాశనం అయిందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన చంద్ర బాబును గెలిపించాలని పిలుపునిచ్చారు.

    ఇక లోకేష్‌ పోటీ చేస్తున్న మంగళగిరిలో ప్రచారాన్ని హోరెత్తించారు నారా బ్రాహ్మణి. బేతపూడిలో పర్యటించిన ఆమె.. పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పూలు కోశారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు కూలీలు. విద్యుత్‌ బిల్లులు ఎక్కువ రావడంతో పింఛన్‌ తొలగించారని.. పరిశ్రమలు లేక పోవడంతో తమ పిల్లలకు ఉద్యోగాలు లభించడం లేదని తమ గోడును వెళ్లబోసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని వారికి హామీ ఇచ్చారు నారా బ్రాహ్మణి.

ఆకాశాన సగం.. అన్నింటా సగమన్న మాటను నిజం చేస్తున్నారు ఈ నందమూరి ఆడపడుచులు, నారా వారి కోడళ్లు. రాజకీయరంగంలో ఉన్న తమ కుటుంబ సభ్యుల గెలుపుకోసం ఎన్నడూ బయటకు రాని భువనేశ్వరి, బ్రాహ్మణిలు ప్రజలతో మమేకమవుతున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుం టున్నారు. అంతేకాదు, పార్టీ క్యాడర్‌లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇక మరోపక్క తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి కూడా టీడీపీకి మద్దతు తెలుపుతూ ట్విట్టర్‌ వేదికగా బాలయ్యను గెలిపించాలని కోరుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి దగ్గర బంధువైన అలేఖ్య ఎవరికి మద్దతిస్తారన్న చర్చ జోరుగా సాగింది. అయితే ఆ సందేహాలకు చెక్‌ పెడుతూ ఆమె అత్తింటివారిపై ఉన్న ప్రేమను బయటపెట్టారు. సోషల్ మీడియా వేదికగా 2024 ఎన్నికలలో నా మద్దతు బాలకృష్ణ మామయ్యకే అని ఆమె చెప్పుకొచ్చారు. ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ఉన్నానని తరచూ తనను ప్రశ్నిస్తున్నారన్న అలేఖ్య.. నా మద్దతు, ప్రేమ నా ఫ్యామిలీ వైపు ఉంటాయని వెల్లడించారు. మరి ఈ నందమూరి, నారావారి మహిళల మద్దతు ఏ మేర పని చేస్తుంది..? కుటుంబ సభ్యుల పూజలు ఫలిస్తాయా..? టీడీపీని విజయం వరిస్తుందా..? అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version