Site icon Swatantra Tv

అమిత్ షా ముందు తన గోడు వెల్లబోసుకున్న నారా లోకేష్

స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రబాబు నాయుడు అరెస్టయి దాదాపు నెల దాటింది. ఇప్పటికీ బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆయన కుటుంబంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తరచూ దిల్లీ పర్యటనలు చేస్తూ కేంద్రం దృష్టికి బాబు అక్రమ అరెస్టును తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం రోజున మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను నారా లోకేశ్ కలిశారు. ఏపీ సీఎం జగన్‌ కక్ష సాధింపు చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. చంద్రబాబుపై కేసులు, ట్రయల్‌ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి లోకేశ్‌ షాకు వివరించినట్లు సమాచారం. చంద్రబాబును అరెస్ట్‌ చేసి విచారణ పేరుతో వేధిస్తున్నారని… ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణినీ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షా ముందు లోకేశ్ తన గోడు వెల్లబోసుకున్నారు. అయితే ఇదంతా విన్న షా.. ‘చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు? మీపై ఎన్ని కేసులు పెట్టారు?’ అని లోకేశ్‌ను అడిగారు. చంద్రబాబు ఆరోగ్యంపై కూడా ఆయన ఆరా తీసిన ఆయన… 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

Exit mobile version