Site icon Swatantra Tv

కమ్యూనిస్టు పార్టీ నేతలను క్షమాపణ కోరిన నారా లోకేష్‌

ఏపీ మంత్రి నారా లోకేష్‌ కమ్యూనిస్టు పార్టీ నేతలను క్షమాపణ కోరారు. ఇందేంటి మంత్రి క్షమాపణలు కోరడమేంటనుకుంటున్నారా? ఇది అక్షరాలా నిజం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీసత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా సీపీఎం నేతలను ముందస్తు అరెస్టు చేశారు స్థానిక పోలీసులు. గురువారం మడకశిర మండలం గుండుమలలో నిర్వహించిన ప్రజావేదికలో పింఛను లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛను డబ్బులు అందజేశారు. అయితే శ్రీసత్యసాయి జిల్లా‌లో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు పెనుకొండ, మడకశిర ప్రాంతాల్లో సీపీఎం నాయకులను, ప్రజా సంఘాల ముఖ్య కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేశారు.

ఈ విషయంలో ఆ పార్టీ ఘాటుగా స్పందించింది. తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఏపీ సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగానే.. ఇప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం నిర్బంధ చర్యలు కొనసాగించడం సరైనది కాదని సీపీఎం పేర్కొంది. ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని కోరింది.

ఈ విషయంపై స్పందించిన మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు చేశారు. ‘‘మమ్మల్ని మన్నించండి కామ్రేడ్.. ’’ అంటూ ట్వీట్‌ చేశారు. సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల మన్నించాలన్నారు. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు.

గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదని నారా లోకేష్ అన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వమని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతామని తెలిపారు. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నానని లోకేష్ పేర్కొన్నారు.
మంత్రి స్పందనపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version