Site icon Swatantra Tv

Jayasudha : బీజేపీలోకి సినీ నటి జయసుధ..?

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపుతున్నాయి. ఎవరైతే అసంతృప్తితో అటు ఇటుగా ఉంటారో.. వారిని తమ పార్టీల్లోకి లాగేసుకునేందుకు ముమ్మరంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నేతలు, కార్యకర్తలు అంతా ఉన్న పార్టీని వీడి వేరే పార్టీల్లో చేరుతున్నారు. బీజేపీ నేతలు ఈ చేరికల అంశంలో చకచకా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వారు పని చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీలోకి చేరికలు గట్టిగానే ఉంటాయని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి కొందరు సీనియర్ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

కాషాయా తీర్థం పుచ్చుకునేందుకు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఇప్పటికే వివేక్ ను కూడా కలిశారు. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, డీసీసీబీ మాజీ ఛైర్మన్లు లక్ష్మారెడ్డి, జైపాల్ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, సంజీవరావు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ప్రముఖ నటి జయసుధ పేరు కూడా చేరినట్లు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆవిడ బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే కిషన్ రెడ్డితో సమావేశం అయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం హైకమాండ్ పిలుపు మేరకు కిషన్ రెడ్డి, డీకే అరుణ ఢిల్లీ పయనమయ్యారు. వీళ్లు తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ఈ వార్తలు, పార్టీల్లో చేరికలతో తెలంగాణలో రాజకీయం బాగా వేడెక్కింది.

 

Exit mobile version