Site icon Swatantra Tv

దొంగల ఆటకట్టించిన తల్లీ కూతుళ్లు

దొంగలన్న మాట వింటే చాలు ఎవరికైనా ఒంట్లో వణుకు పుట్టుకొస్తుంది. ఇక దొంగలే ఎదురుగా ఉంటే.. అమ్మ బాబోయ్‌… ఊహించడానికే భయంగా ఉంది కదా. అయితే,.. బేగంపేటలోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి తుపాకీ గురి పెట్టినా ఏమాత్రం అదురు బెదురు లేకుండా వారి ఆటకట్టించిన తల్లీ కూతుళ్ల సాహసం గురించి తెలుసుకోవాల్సిందే.

బేగంపేట పరిధిలోని రసూల్‌పురాలో పట్టపగలే చోరీ కోసం ఇంట్లోకి చొరబడ్డారు ఇద్దరు దొంగలు. మధ్యాహ్నం 2:15 గంటలకు ఎన్‌కే జైన్‌ పేరుతో కొరియర్‌ వచ్చిందంటూ వచ్చారు ఇద్దరు దుండగులు. కొరియర్‌ తీసుకునేందుకు వెళ్లగా ఇంతలోనే ఒక్కసారిగా తుపాకీ బయటకుతీసి బెదిరించారు. ఇంట్లో ఉన్న వస్తువులు, నగదును ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని భయపెట్టారు. అయితే,.. గన్‌ను చూసినా ఏమాత్రం బెదరని ఇంటి యజమానురాలు అమిత్‌ మహోత్ దుండగులపై దాడికి దిగింది. ఆపదలో చిక్కుకున్న తల్లిని చైసిన కుమార్తె కూడా దొంగలపై శివంగిలా విరుచుకుపడింది. వీరిద్దరి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని దుండగుల్లో ఒకడిని పట్టుకోగా.. మరొక దొంగ తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి.

దొంగతనానికి వచ్చిన నిందితులు బీహార్‌కి చెందిన ప్రేమ్ చంద్, సునీల్ కుమార్‌గా గుర్తించారు. వీరిద్దరూ సోమాజిగూడలోకి హౌస్‌ క్లీనింగ్‌ కంపెనీలో పని చేస్తున్నారు. గత ఏడాది దీపావళి సమయంలో అమిత ఇంట్లో పని చేయడానికి వచ్చి నాలుగు రోజులపాటు పని చేశారు. ఆ సమయంలో వీరి ఇంట్లో భారీగా నగలు, నగదు, బంగారు ఆభరణాలను గుర్తించి.. దోపిడీ చేయడానికి పక్కాగా ప్లాన్‌ వేసుకున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల ముందు రెక్కీ నిర్వహించి ఆ తర్వాత చోరీకి యత్నించారు . కొరియర్ వచ్చిందని చెప్పి ఇంట్లోకి వచ్చారు.

తల్లీ కూతుళ్ల ధైర్య సాహాసాలపై జనం ప్రశంసలు కురిపిస్తున్నారు. వారిద్దరి పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని అభినందిస్తున్నారు. నార్త్‌జోన్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తల్లీకూతుళ్ల ధైర్యాన్ని అభినందిస్తూ వారిని సన్మానించారు. తన పదకొండేళ్ల సర్వీస్‌లో ఇంత ధైర్యసాహసాలు చూపించిన మహిళలను చూడలేదన్నారు ప్రియదర్శిని. ఇద్దరు నిందితుల్లో ఒకరిని అమిత్‌ ఇంట్లోనే పట్టుకోగా.. మరొకరిని రైలు ఎక్కి పారిపోతుండగా కాజీపేటలో జీఆర్పీ పోలీసులు పట్టుకున్నట్టు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని.. ఆయుధాలు ఎక్కడి నుండి తెచ్చారు..? వీరిపై గతంలో ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ఎంక్వైరీ జరుగుతోందని వెల్లడించారు. మహిళలు కూడా సెల్ఫ్‌ డిఫెన్స్‌ నేర్చుకోవాలని సూచించారు డీసీపీ ప్రియదర్శిని. చూశాం కదా. పట్టపగలే దొంగలు ఇళ్లలోకి చొరబడుతున్నారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది. అందుకే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు.

Exit mobile version