Site icon Swatantra Tv

అన్నదాత అకౌంట్లలోకి డబ్బులు

కాసేపట్లో రైతులకు రుణమాఫీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తొలి విడతలో భాగంగా ఇవాళ రూ. లక్ష లోపు రుణాలున్న 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనున్నారు. మెుత్తం మూడు విడతలుగా రుణమాఫీ చేయనుండగా.. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల మాఫీ చేయనున్నారు.

సెక్రటేరియట్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 110 రైతువేదికల్లోని రైతులతో నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి తొలి విడతలో రూ.లక్ష లోపు రుణాల మాఫీని ప్రారంభించనున్నారు. ఆ వెంటనే 11.50 లక్షల మంది రైతుల రుణ బ్యాంకు ఖాతాల్లో రూ.లక్ష వరకు డబ్బులు జమ కానున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులతో పాటు రైతులను, లబ్ధిదారులను రైతువేదికల వద్దకు ప్రభుత్వం ఆహ్వానించింది. మాఫీ నిధులు రుణఖాతాల్లో జమ అయ్యాయనే మెసేజ్‌ ఫోన్‌కు వచ్చిన వెంటనే ఆయా రైతులను మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించనున్నారు. ఈ మేరకు రైతుులతో సంబరాలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

రుణమాఫీ కోసం అవసరమైన నిధులను ఆర్థికశాఖ ఇప్పటికే బ్యాంకుల ఖాతాల్లోకి జమ చేసింది. రూ. లక్ష లోపు రుణాల మొత్తం రూ. 6 వేల కోట్లకు పైగా జమ చేసింది. రూ.లక్ష లోపు రుణమాఫీ వర్తించే అన్నదాతల జాబితాను కూడా అన్ని జిల్లాల వ్యవసాయాధికారులకు పంపించింది. మెుత్తం మూడు దఫాలుగా రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేడు రూ. లక్ష వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయనున్నారు. ఈ రోజు నేరుగా రైతు ఖాతాలో రుణమాఫీ సొమ్ము జమ చేస్తారు. ఈ నెలఖారులోగా రూ.లక్షన్నర వరకు రుణాలు చేయనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఆగస్టు 15 లోగా రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. రైతు రుణమాఫీ నిమిత్తం ప్రభుత్వం మొత్తం రూ. 31 వేల కోట్లు జమ చేయనుండగా.. మొత్తం 32 బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చాయి.

Exit mobile version