Site icon Swatantra Tv

రాజ్యాంగ సవరణల దిశగా మోదీ అడుగులు ?

  2024 లోక్ సభ ఎన్నికల రాజకీయాలు, పార్టీల ప్రచారం రాజ్యాంగం చుట్టూ సాగుతున్నాయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేస్తుందని, ఇక ఇదే చివరి ఎన్నికలు కాగలవని కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లతో సహా ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అధికార బీజేపీ రాజ్యాంగం సవరణల విషయంలో రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోంది. మోదీ అసలు ఉద్దేశం ఏమిటి? భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారా? రాజ్యాంగం కూడా కాషాయీకరణ చేసేస్తారా?

  బీజేపీ అధికారంలోకి వచ్చిన గత పదేళ్లలో రాజ్యాంగానికి ఎన్నో సవరణలు చేసింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు, పౌరసత్వం సవరణ చట్టం, దశాబ్దాలుగా ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ తో సహా ఎన్నో మార్పులు చేసింది. రాజ్యాంగం విషయంలో బీజేపీ పెద్దలు రోజుకో మాట మాట్లాడుతూ.. రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్కడ్ తోపాటు, చిన్న, పెద్ద నాయకులు తరచు రాజ్యాంగం మార్పుపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ. సంచలనాలు సృష్టిస్తున్నారు. ప్రధాని మోదీ ” 400 ” పైగా పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని ఎన్నికల ప్రచారంలో హోరెత్తి స్తుంటే.. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకే 400 సీట్లు కోరుకుంటున్నారని ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి.

   1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి26 నుంచి రాజ్యాంగం అమలు లోకి వచ్చింది. అప్పటి నుంచి 2021 డిసెంబర్ వరకూ 104 సవరణలు చేశారు. 1951లోనే సామాజికంగా, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం ప్రత్యేక రాయతీలు, కేటాయింపులు చేసే అధికారం ప్రభుత్వాలకు కల్పిస్తూ తొలి రాజ్యాంగ సవరణ చేశారు. అప్పటి నుంచి వరుసగా కేంద్రంలో ప్రభుత్వాలు రాజ్యాంగానికి సవరణలు చేస్తూ వచ్చాయి. కాలానుగుణంగా, ఆయా పరిస్థితులు, అవసరాల మేరకు రాజ్యాంగ సవరణలు చేస్తున్నా, రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు వీలు లేదని సుప్రీంకోర్టు 1973 ఏప్రిల్ లో అత్యంత విశిష్టమైన తీర్పు ఇచ్చింది. దీంతో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకునే సవరణలు చేస్తూ వచ్చాయి.

   కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెండు దశల్లో చేసిన భారత్ జోడో యాత్ర, న్యాయ్ యాత్ర సందర్భంగా దాదాపు ప్రతి సభలోనూ బీజేపీ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు యత్నిస్తోందని దుమ్మెత్తి పోస్తున్నారు. మోదీ సర్కార్ కార్పొరేట్ వర్గాలు, ధనిక వర్గాల అడుగులకు మడుగు లొత్తుతూ.. పేద, బలహీనవర్గాలకు రాజ్యాంగ ఫలాలను దూరం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుత రాజ్యాంగాన్ని రద్దుచేసి దాని స్థానే కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడమే బీజేపీ లక్ష్యం అని, సీపీఐ పార్టీ నాయకులు కె. సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి ఆరోపించారు.

   ప్రధాని మోదీ రాజ్యాంగ సవరణపై ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతున్నారు. కానీ, అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చవచ్చని పలువురు కాషాయదళం ఎంపీలు, ఎంపీ అభ్యర్థులు అరుణ్ గోవిల్, జ్యోతి మిర్దా, అనంత్ కుమార్ హెగ్డే, లల్లూ సింగ్ లు వాదిస్తున్నారు. వాస్తవానికి అరుణ్ గోవిల్ రాజ్యాంగం మార్పులపై చర్చించిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర వివాదం చెలరేగింది. బీజేపీ – ఆరెస్సెస్ ఎప్పటి నుంచో రాజ్యాంగం మార్చాలని డిమాండ్ చేస్తూ వచ్చాయి. 1949 లోనే బీజేపీ మాతృసంస్థ అయిన ఆరెస్సెస్ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించింది. ఇది అమెరికా, ఇంగ్లండ్ వంటి పలు దేశాల రాజ్యాం గాల నుంచి రూపొందించిందని, ఈ రాజ్యాంగంలో భారతీయత లోపించిందని దుమ్మెత్తి పోసింది. ప్రధాని మోదీ.. ఆరెస్సెస్ కార్యకర్త నుంచి ఎదిగారు. బీజేపీ ఏర్పాటుతో రాజకీయ అరంగేట్రం చేసినా. మనిషి మనసు అంతా.. హిందుత్వ భావజాలంతో నిండినదే. అవకాశం వస్తే, కచ్చితంగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి వెనుకాడక పోవచ్చు. గతంలో ఏ లోక్ సభ ఎన్నికల్లోనూ రాజ్యాంగం, సవరణల పై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు. ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పదేపదే ఇదే అంశాన్ని చర్చిస్తున్నందువల్ల సామాన్య  ప్రజలు. ప్రజాస్వామిక వాదులు. ఈ ఎన్నికల్లో ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version