Site icon Swatantra Tv

బీఆర్‌ఎస్‌ ట్రోలింగ్‌ను క్షమించబోమంటూ మంత్రి కొండా సురేఖ ఫైర్‌

బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు గౌరవ సూచకంగా తనకు ఒక నూలు దండ వేస్తే.. దాన్ని బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా అసభ్యకరంగా ట్రోల్‌ చేసిందంటూ మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ట్రోలింగ్‌ చూసి గడిచిన రెండ్రోజులుగా తనకు అన్నం సహించడం లేదని, నిద్ర పట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్‌, హరీశ్‌రావు ఇంట్లో ఆడవాళ్లపైనా ఇలాంటి ట్రోలింగ్‌ చేస్తే వారికెలా ఉంటుందని ప్రశ్నించారు. రఘునందన్‌రావు తనకు సోదర సమానుడని, ఆయన తనకు ఫోన్‌ చేసి బాధపడ్డారని వెల్లడించారు. తనపైన జరిగిన ట్రోలింగ్‌కు హరీశ్‌, కేటీఆర్‌లు క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ద్వారా ఇకపైన ఇలా ట్రోలింగ్‌లు చేస్తే క్షమించేది లేదని స్పష్టం చేశారు.

మరోవైపు సోషల్‌ మీడియాలో మంత్రి కొండా సురేఖను ట్రోల్‌ చేయడం, ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి తానూ చింతిస్తున్నానని హరీశ్ రావు అన్నారు. సోషల్‌ మీడియా వేదికగా జరిగే ఈ వికృత చేష్టలను ఖండిస్తున్నానని ఎక్స్‌లో పేర్కొన్నారు. మహిళలను గౌరవించటం మనందరి బాధ్యత, వారి పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే ఏ ఒక్కరు కూడా సహించబోరని స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ అయినా.. వ్యక్తిగతంగా తానైన ఉపేక్షించేది లేదన్నారు. సోషల్‌ మీడియాలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

Exit mobile version