Site icon Swatantra Tv

తుది అంకానికి చేరుకున్న మేడారం మహాజాతర

    నాలుగు రోజులుగా వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ సమ్మక్క, సారలమ్మ దేవతలు వనప్రవేశం చేయనున్నారు. ఈ ఘట్టంతో మహా జాతర పరిసమాప్తమవుతుంది.సాయంత్రం పూజారులు గద్దెల వద్దకు వచ్చి, సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వన దేవతల వన ప్రవేశం మొదలవుతుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి పూజారులు ఊరేగింపుగా తీసుకువెళ్తారు. పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయ్ గ్రామానికి తీసుకెళ్తారు. ఈ ప్రక్రియతో జాతర ముగుస్తుంది.

    మరోవైపు చివరిరోజు కావడంతో మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకు నేందుకు భక్తజనం క్యూలైన్లలో బారులు తీరారు. మేడారం పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. మూడు రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు చివరి రోజైనా వచ్చి దర్శనాలు చేసుకో వాలని భారీగా తరలివస్తున్నారు. తల్లుల వనప్రవేశం సమయంలో కొంతసేపు దర్శనాలను నిలిపివేసినా మళ్లీ యథా తథంగా జరుగుతున్నాయి. రెండేళ్లకోసారి అమ్మవార్లను దర్శించుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నా, దర్శనం మాత్రం బాగా జరుగు తుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తడంతో భారీగా ట్రాఫిక్​ జామ్ ఏర్పడుతోంది. తాడ్వాయి, పస్రా గుండ్లవాగు వద్ద రాకపోకలు నిలిచి పోతున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోతున్నాయి. ఎంతకీ వాహనాలు ముందుకు కదలక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్​ను క్లియర్​ చేస్తూ మళ్లీ యథావిథిగా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Exit mobile version