Site icon Swatantra Tv

రష్యాలో ఉక్రెయిన్ పెను విధ్వంసం

రష్యాలో ఉక్రెయిన్ పెను విధ్వంసం సృష్టించింది. రాత్రంతా డ్రోన్లతో రష్యాపై విధ్వంసం సృష్టించింది. రష్యా సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రష్యాలోని పశ్చిమ ప్రాంతంలోని ట్వెర్‌లో ఉక్రెయిన్ ఈ దాడి చేసింది. ఉక్రేనియన్ డ్రోన్లు టొరోపెట్స్ నగరంలో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న డిపోను లక్ష్యంగా చేసుకున్నాయి. అక్కడ భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, బాంబులు నిల్వ ఉంచారు.

డ్రోన్ దాడి తర్వాత ఈ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇస్కాండర్ క్షిపణి వ్యవస్థ, తోచ్కా-యు క్షిపణి వ్యవస్థ, గైడెడ్ ఏరియల్ బాంబులు, ఫిరంగి, మందుగుండు సామగ్రిని ఈ డిపోలో నిల్వ ఉంచారు. టొరోపెట్స్ నగరంపై రాత్రిపూట డ్రోన్‌ల దాడి జరిగిందని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ నివేదించింది. శిథిలాలు పడిపోవడంతో డిపోలో భారీగా మంటలు చెలరేగాయి.

దీంతో చుట్టుపక్కల ఉన్న భవనాలను వెంటనే ఖాళీ చేయించారు. అక్కడి నుంచి ప్రజలను వేరే ప్రాంతానికి తరలించారు. ఆ ప్రాంతాన్ని సైనిక విభాగం తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రష్యన్ నగరం టొరోపెట్స్ ఉక్రేనియన్ సరిహద్దు నుండి 300 మైళ్ల దూరంలో.. మాస్కోకు పశ్చిమాన 250 మైళ్ల దూరంలో ఉంది.

దాదాపు రెండున్నరేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇది ఎప్పుడు ముగుస్తుందో తేల్చలేని పరిస్థితి. చాలా కాలంగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇరు దేశాలు భారీగా నష్టపోయాయి. ఈ యుద్ధం 2022, ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇరు దేశాలకు చెందిన లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది ఇళ్లు వదిలి వెళ్లిపోయారు.

Exit mobile version