Site icon Swatantra Tv

ఆ రోజే.. అక్కడి నుంచే… లోకేష్ ‘యువగళం’ పున:ప్రారంభం

వస్తున్నా మీ కోసం అంటూ మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారు నారా వారి వారసుడు. యువగళం పాదయాత్రను ఎక్కడైతే ఆపేశారో మళ్లీ అక్కడ్నుంచే పున: ప్రారంభించేందుకు సన్నద్దమవుతున్నారు. అయితే.. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇచ్ఛాపురం వరకు కాకుండా విశాఖలోనే ముగియనుంది యువగళం పాదయాత్ర.

స్కిల్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల్లో అప్పటికే నారా లోకేష్‌ చేస్తున్న యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. సెప్టెంబర్ 9న బాబు అరెస్టు సమయానికి కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో పాదయాత్ర చేస్తున్న లోకేష్ అక్కడికక్కడే తాత్కాలికంగా విరామం ప్రకటించారు.

మొన్నటి వరకు చంద్రబాబు బెయిల్ వ్యవహారంతోపాటు పార్టీ వ్యవహారాల్లో తలమునకలై ఉన్న లోకేష్..ఇప్పుడు ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ దొరకడంతో కాస్త ఫ్రీ అయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 29 నుంచి చంద్రబాబు మళ్లీ రాజకీయాల్లో బిజీ కానుండడంతో యువగళం వైపు దృష్టిసారించారు లోకేష్. గతంలో తన పాదయాత్ర ఆపేసిన రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచే తిరిగి ఈనెల 27న ప్రజల్లోకి వెళ్లనున్నారు. యాత్రను పున:ప్రారంభించనున్నారు.

రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణం, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా యాత్ర అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అనంతరం అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల నుంచి సాగే పాదయాత్ర విశాఖలో ముగియనుంది.

ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో యువగళం పేరుతో మొదలైన యాత్ర 400 రోజుల్లో 4000 కిలోమీటర్లు పూర్తిచేయాలన్న లక్ష్యంతో మొదలైంది. అందుకు తగ్గట్లుగానే రూటు మ్యాప్ రూపొందించారు. 208 రోజుల్లో 2 వేల 852 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేశారు లోకేష్. మొత్తం తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని 84 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. అయితే..మధ్యలో చంద్రబాబు అరెస్టు, పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ కోసం రెండున్నర నెలల పాటు విరామం ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని భావించి మళ్లీ యువగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు నారా లోకేష్.

Exit mobile version