Site icon Swatantra Tv

భూకబ్జాలతో రెచ్చిపోయిన వరంగల్‌ జిల్లా నేతలు

    వివాదాలు ఎప్పుడూ ఆయన చుట్టే ఉంటాయి. భూ కబ్జా అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆ మాజీ ఎమ్మెల్యే. వివాదాల ఎమ్యెల్యే గానూ ఆనాడు పేరు తెచ్చుకున్నారు. ఆ నియోజకవర్గం లో భూ కబ్జా చేయడమంటే వెన్నతో పెట్టిన విద్య ఆయనకు. అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్, ఇంకా ఎవరూ తనను ఏం చేయలేరని చెప్పేవాడు మరి. నేడు పోలీసులే కేసు నమోదు చేసే వరకు వివాదాలు వచ్చాయి. ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో ఏమిటో ఆ వివారాల్లోకి వెళదాం.

   ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొందరు ఎమ్యెల్యేల తీరు మాజీలు అయిన తర్వాత వివాదాస్పదంగా మారుతున్నాయి. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. భూ వివాదంపై సొంత పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్, కౌన్సిలర్ గాడిపెల్లి ప్రేమలత రెడ్డి కుమారుడు రాజేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటకోడూరులోని తమ స్వంత పట్టా భూమి లోంచి జనగామ రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 39లోకి అక్రమంగా దారి తీసుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఇదేమిటని ప్రశ్నించినందుకు తమ కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురిచేసి, తనపై అక్రమంగా కేసు పెట్టించి విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. సరైన సాక్ష్యాలతో ఏసీపీకి ఫిర్యాదు చేయగా..ఫిర్యాదుపై ఏసీపీ అంకిత్ కుమార్ విచారణ చేసి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన అనుచరుడు బూరెడ్డి ప్రమోద్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

   ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని అడ్డదారిలో భూ కబ్జా చేశారని ఫిర్యాదులో తెలిపారు రాజేందర్‌రెడ్డి. అదే విధంగా తనపై అక్రమ కేసులు పెట్టించి అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ నేత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ప్రశ్నించిన పాపానికి తన కుటుంబ సభ్యులను బెదిరించారని వాపోయాడు. అంతే కాకుండా తనను విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు రాజేందర్ రెడ్డి.

    ఇక దీనిపై జనగామ ఏసీపీ అంకిత్ కుమార్ శంక్వాడ్ ఆర్డీవో, రెవెన్యూ అధికారుల సమక్షంలో విచారణ జరిపారు. వివాదాస్పద భూమిని పరిశీలించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం జనగామ పోలీస్ స్టేషన్‌లో 447, 427, 506 r/w34 ఐపీసీ సెక్షన్‎లో కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. గతంలో తన సొంత కూతురే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై అనేక ఆరోపణలు చేశారు. తన తండ్రి కబ్జా కోరు అని చేర్యాల భూమి విషయంలో ఆయనపై స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైకోర్టు దాకా ఈ విషయం వెళ్ళింది అయినా కూడా ముత్తిరెడ్డి తన పద్ధతి మార్చుకోలేదు. సొంత కూతురే అతనిపై ఫిర్యాదు చేసింది. కబ్జా భూములు అంటే ముత్తిరెడ్డికి ప్రాణం అని జనగాం నియోజకవర్గ ప్రజలు అంటారు. గతంలోనూ అనేకసార్లు ముత్తిరెడ్డిపై భూ వివాదాల కేసులు చుట్టుముట్టాయి. అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అధికారంలో ఉన్నంతకాలం ఆరోపణలు కొట్టి పారేసిన ముత్తిరెడ్డి..ఇప్పుడు తాజాగా మరో కేసులో ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముత్తిరెడ్డి గతంలో ఓ కలెక్టర్‌పై చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మాజీ ఎమ్మెల్యే చేసిన భూ అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వేచి చూడాలి మరి చివరకు ముత్తిరెడ్డి పరిస్థితి ఎట్లా ఉంటుందో.

Exit mobile version