కార్పొరేట్ రంగంలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతుంటారు. అలాగే కార్పొరేట్ ఫీల్డ్‌లో ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయిస్తుంటారు. అలాంటి కార్పొరేట్ జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. అదే ‘బెంచ్ లైఫ్’. కార్పొరేట్ ఉద్యోగుల జీవనశైలిలోని వాస్తవాలను చూపిస్తూ ఎంటర్‌టైనర్‌గా ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు మానస శర్మ. కామెడీ-డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ అందరినీ ఎంతగానో నవ్విస్తుందని టీమ్ చెబుతోంది.
ఇటీవల ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాతో హిట్ అందుకున్న నిహారిక కొణిదెల ఈ సిరీస్‌ను నిర్మించడం మరో విశేషం. ఈ సందర్భంగా నిహారిక కొణిదెల మాట్లాడుతూ, “కార్పొరేట్ బెంచ్‌లో ఉన్న ప్రత్యేకమైన అనుభవాన్ని చూపించే ఒక షోను రూపొందించాలనుకున్నాం. బెంచ్‌పై ఉండడం అనేది ఉద్యోగులు తరచుగా ఏదో కోల్పోయినట్లు, అనిశ్చితంగా భావించే ప్రదేశం. కానీ ఎన్నో అనుకోని పరిస్థితుల్లో కూడా, జీవితంలో వృద్ధి చెందే, కలలు నెరవేరే అవకాశాలు ఉన్నాయని బాలు, మీనాక్షి, ఇషా, రవి, అతని స్నేహితుల ద్వారా మేము చూపిస్తున్నాం. బెంచ్ లైఫ్ అనేది తిరిగి కోలుకోవడం, స్నేహం, ఆనందాన్ని వేడుక చేసుకోవడం’’ అని చెప్పారు.
బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్‌లో వైభవ్ రెడ్డి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్, చరణ్ పేరి వంటి నటీనటులతో పాటు రాజేంద్ర ప్రసాద్, తులసి, తనికెళ్ల భరణి వంటి ప్రముఖ నటులు నటించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రానికి ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ అందించగా, పి.కె. దండి సంగీతం అందించారు. బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి సోనీ లివ్‌లో ప్రసారం కానుంది.