కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో పదేళ్ల విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. తెలంగాణ ప్రజలు పిలిస్తే క్షణాల్లో వస్తానన్న రాహుల్ గాంధీ.. ఇన్నాళ్లు ఎక్కడ దాక్కుకున్నారని సూటిగా ప్రశ్నించారు. గాంధీ భవన్ కు కాదని… ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ముందా అని నిలదీశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలకు ముందు క్షమాపణ చెప్పాలన్నారు. ఏడాదిలోనే అన్ని వర్గాలను రోడ్డెక్కించిన ఘనత ప్రభుత్వానిదే అన్నారు. సబ్బండ వర్గాలను మోసం, నయవంచనకు గురి చేసిన పాపంలో ప్రధాన పాత్ర తమదే అంటూ ట్వీట్ చేశారు.
పులకేసి మాదిరిగా ముఖ్యమంత్రి ప్రజలను హింసిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? అని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే హైడ్రా, మూసీ బాధితులకు వద్దకు వెళ్లాలన్నారు. తమరి చేతగాని పాలనతో రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకున్నారని తెలిపారు. పార్టీ ఫిరాయింపులతో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న ముఖ్యమంత్రికి ఎందుకు అండగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.