Site icon Swatantra Tv

ఆప్‌ నేతలకు వంద కోట్లు ముడుపులు చెల్లించడంలో కవిత కీలక పాత్ర పోషించారు – ఈడీ

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా వంటి ఆప్‌ అగ్ర నేతలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కుమ్మక్కయ్యారని ఈడీ స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ రూపకల్పన, అమలు ద్వారా అక్రమంగా ప్రయోజనాలు పొందాలని చూశారని ఈడీ పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్, పాత్రపై ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆప్‌ నేతలకు వంద కోట్లు ముడుపులు చెల్లించడంలో కవిత కీలక పాత్ర పోషించారని వివరించింది. ముడుపుల రూపేణా చెల్లించిన సొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు, లాభాలు ఆర్జించేందుకు వీలుగా మొత్తం కుట్ర జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా మద్యం విధానం రూపొందించారని పేర్కొంది.

హైదరాబాద్‌లో తాము సోదాలు నిర్వహిస్తున్నప్పుడు కవిత బంధువులు, సహచరులు తమను అడ్డుకున్నారని ఈడీ తెలిపింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈ నెల 15న కవిత అరెస్టు తర్వాత మొదటిసారి ఈడీ అధికారికంగా స్పందించింది. ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నై, ముంబై తదితర 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని,128.79 కోట్ల ఆస్తులను జప్తు చేశామని తెలిపింది. సిసోడియాతో పాటు సంజయ్‌సింగ్‌, విజయ్‌నాయర్‌ వంటి ఆప్‌ నేతలను ఆరెస్టు చేశామని పేర్కొంది. కుంభకోణంపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని తెలిపింది. ఢిల్లీలోని మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు ఈ నెల 23 వరకు కవితకు రిమాండ్‌ విధించడంతో పాటు విచారణ నిమిత్తం ఈడీ కస్టడీకి అప్పగించినట్లు పేర్కొంది.

Exit mobile version