Karnataka Elections |కర్ణాటకలో ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 224 శాసనసభా స్థానాలున్న కర్ణాటకలో మే 10వ తేదీన పోలింగ్ జరగనుంది. 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇవాళ నుంచి కర్ణాటక వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లైంది. కర్ణాటక వ్యాప్తంగా 5కోట్ల 21లక్షల మంది ఓటర్లు ఉన్నారని వీరిలో పురుషులు 2కోట్ల 62 లక్షల మంది కాగా.. మహిళలు 2కోట్ల 59 లక్షల మంది ఉన్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా ‘ఓట్ ఫ్రమ్ హోం’ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు.
Karnataka Elections |కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా.. ప్రస్తుత శాసనసభ గడువు మే 25వ తేదీతో ముగియనుంది. ప్రస్తుత అసెంబ్లీలో సంఖ్యా బలాలు చూసుకున్నట్లయితే.. బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్‌కు 75 మంది, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలున్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ తనదైన వ్యూహలతో ముందుకెళ్తుండగా.. ఈసారి అధికారాన్ని చేపట్టేందుకు కాంగ్రెస్ అన్ని రకాల ప్రయత్నలు చేస్తోంది. ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తించడంతో పాటు.. తొలి విడత అభ్యర్థుల జాబితాను కూడా కాంగ్రెస్ విడుదల చేసింది. మరోవైపు జెడిఎస్ కూడా గెలుపు కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెడిఎస్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ మద్దతు మాత్రమే తెలుపుతుందా.. ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also: కాసేపట్లో కర్ణాటక ఎన్నికల షెడ్యూల్.. వయనాడ్ ఉప ఎన్నికపై ఉత్కంఠ..
Follow us on: Youtube, Instagram, Google News