Site icon Swatantra Tv

కాళేశ్వరం, పవర్ కమిషపన్లను నివేదిక కోరిన ప్రభుత్వం

   తెలంగాణలో విచారణ కమిషన్లు వేగం పెంచాయి. ఇటు కాళేశ్వరం అటు పవర్ కమిషన్లు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా విచారణ పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. మాజీ అధి కారులకు నోటీసులు ఇచ్చి వివరణలు తీసుకుంటున్నాయి. నిజనిజాలు తెలుసుకున్న తర్వాత ఆర్థిక పరమైన అంశాలను విచారిస్తామన్నారు.

   తెలంగాణలో కాళేశ్వరం, విద్యుత్ శాఖలో అవకతవకలు జరిగాయని,ఆ రెండు శాఖలకు సంబంధిం చిన అంశాలపై విద్యుత్ కమిషన్‌, కాళేశ్వరం కమిషన్‌ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యుత్ కమిషన్‌కు ఎల్ నరసింహారెడ్డి, కాళేశ్వరం కమిషన్‌కు పినాకి చంద్ర ఘోష్ నేతృత్వం వహిస్తున్నారు. విద్యుత్‌లో యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ ఒప్పందాలకు సంబంధించిన అంశాలపై కమిషన్ విచారణ జరుపుతుండగా, కాళేశ్వరం కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలో అవకతవకలకు సంబంధించిన విచారణ చేస్తోంది. రెండు విచారణ కమిషన్లు దాదాపు మూడుసార్లు ఇప్పటికే అధికారుల తో భేటీ అయ్యాయి. అదే విధంగా ఫీల్డ్ విజిట్ కూడా రెండు కమిషన్లకు సంబంధించిన చీఫ్‌లు చేశారు.

  విద్యుత్ కమిషన్‌కు సంబంధించి చీఫ్ ఎల్ నరసింహారెడ్డి విద్యుత్ శాఖలో దాదాపు 30 మంది తాజా మాజీ అధికారు లకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నారు. ముఖ్యంగా మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, అప్పటి శాఖకు కీలక అధికారి గా పనిచేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు నోటీసులు ఇచ్చారు. అయితే అరవింద్ కుమార్ నోటీసులకు పోస్ట్ ద్వారా రిప్లై ఇచ్చినట్లు కమిషన్‌లోని అధికారులు తెలుపగా, సీఎండీ ప్రభాకర్ రావు మాత్రం డైరెక్ట్‌గా కమిషన్ ముందు హాజరై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇక అప్పుడు ఎలక్ట్రిసిటీ కమిషనర్‌గా పనిచేసిన సురేష్ చందర్ సైతం కమిషన్ ముందు స్వయంగా హాజరై లిఖితపూర్వక సమాధానం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో మరి కొంత మందిని విచారణకు పిలుస్తామన్న చర్చ పవర్ కమిషన్‌లో జరుగుతోంది. ప్రస్తుతానికి టెక్నికల్ అంశాలకు సంబంధించిన విషయం మీద కసరత్తు చేస్తున్న కమిషన్ త్వరలోనే ఓ ప్రజాప్రతినికి సైతం నోటీసులు ఇస్తుందన్న చర్చ ఉంది.

  కాళేశ్వరం కమిషన్ కూడా ప్రత్యేకమైనటువంటి కమిటీలను నోడల్ ఆఫీసర్స్ టీంను ఏర్పాటు చేసి ఫీల్డ్ విజిట్‌ను కంప్లీట్ చేసుకుంది. కమిషన్ చీఫ్ చంద్రఘోష్ ఇప్పటికే విచారణ ప్రారంభం అయిందని, అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయన్నారు. విచారణకు వచ్చే అధికారులకు నోటీస్ ఇచ్చామని, పబ్లిక్ నోటీస్ పిరియడ్‌లో 54 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని విచారణ చేస్తామన్నారు. అదే విధంగా ఫిర్యాదులలో ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందలేదని, అందిం చాలని కూడా ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. ఏజెన్సీలను సైతం పిలుస్తున్నాని, నిజాలు తెలుసుకు నేందుకు అందరి వద్ద ఉన్న సమాచారం తీసుకుంటున్నామన్నారు. జూన్ 30 లోపు విచారణ పూర్తి కాదన్నారు. ఇంకా సమయం పడుతుందని కానీ, విచారణ మాత్రం వేగంగా జరుగుతుందన్నారు. అసలు విషయాలు, నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు.

   మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉంది అందుకే కొంత ఆలస్యం అయిందన్నారు., నోటీసులు ఇచ్చిన వారి లో ఏడు మంది సోమవారం విచారణకు హాజరుకాగా, మరో 18 మందిని మంగళవారం విచారణకు రావాలని పిలిచామన్నారు. టెక్నికల్ అంశాల విచారణ పూర్తి అయ్యాక, ఇర్రెగ్యులారిటీ, ఆర్థిక అంశాలపై విచారణ మొదలవుతుందన్నారు. ప్రభుత్వం వద్ద నుంచి రిపోర్టులు అన్ని అందాయన్నారు. వాటి పరిశీలన జరుగుతుందన్నారు. ఇరిగేషన్ మాజీ ENC మురళీధర్ కమిషన్ ముందు హాజరై మరోసారి కమిషన్ అడిగిన సమాచారం ఇచ్చి వెళ్లారన్నారు. అదే విధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణం సమయంలో పని చేసిన ఇంజనీర్లు తిరుమల్ రెడ్డి, ఇషాంక్ సింగ్‌తో పాటు మరో అధికారి సైతం కమిషన్ ముందు హాజరై సమాచారం ఇచ్చారని ఘోష్ తెలిపారు. మొత్తానికి ఇటు కాళేశ్వరం కమిషన్ అటు విద్యుత్ కమిషన్ రెండు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. రెండు కమిషన్లకు ఈనెలాఖరు వరకు ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. మరి ఈ నెలాఖరులోపు రెండు కమిషన్లు ఏ మేరకు నివేదికలు ఇస్తాయన్నది రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version