Site icon Swatantra Tv

జమ్ముకశ్మీర్‌లో జడ్‌-మోడ్‌ సొరంగం.. సైన్యానికి కీలకం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్ముకశ్మీర్‌ గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్‌-మోడ్‌ సొరంగాన్ని ప్రారంభించారు. అనంతరం టన్నెల్‌ లోపలికి వెళ్లి పరిశీలించారు.

శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిపై సోన్‌మార్గ్‌ ప్రాంతంలో రూ.2,700 కోట్లతో జడ్‌-మోడ్‌ టన్నెల్‌ను నిర్మించారు. కొండచరియలు, మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారడంతో ఇక్కడ టన్నెల్‌ ప్రాజెక్ట్ చేపట్టారు. ఇది సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఉంది. 6.5 కిలోమీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్‌లోనైనా లద్దాఖ్‌ను రహదారి మార్గం ద్వారా చేరుకోవడానికి వీలవుతుంది. 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి. దీనివల్ల సోన్‌మార్గ్‌కు పర్యాటకుల రాక కూడా పెరగనుంది.

జడ్‌ మోడ్‌ వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యత దేశానికి కీలకంగా మారుతుంది. ఈ సొరంగం ఆ ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తుందని భావిస్తున్నారు. ఇది శ్రీనగర్‌కు పశ్చిమాన ఉన్న గుల్‌మార్గ్ తర్వాత జమ్మూ , కాశ్మీర్‌లో మరొక స్కీ రిసార్ట్‌గా మారుతుంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. గందర్‌బల్ జిల్లాలోని సోన్‌మార్గ్ రిసార్ట్‌ను గుల్‌మార్గ్ తరహాలో శీతాకాలపు క్రీడల ప్రదేశంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

సోన్‌మార్గ్‌ వల్ల కార్గిల్‌లో రాత్రిపూట బస చేయాల్సిన అవసరం లేకుండా ప్రజలు లడఖ్ చేరుకోవచ్చు. సోన్‌మార్గ్ నుండి – నేషనల్ హైవే-1 – అమర్‌నాథ్ యాత్రకు బేస్ క్యాంప్ అయిన బాల్తాల్‌కు చేరుతుంది. ఆపై వాయువ్య దిశలో లడఖ్‌లోని మటాయెన్, ద్రాస్, కక్సర్, కార్గిల్‌కు వెళ్తుంది.

జడ్‌-మోడ్‌ టన్నెల్‌కి తూర్పున ఉన్న జోజిలా సొరంగం నిర్మాణం పూర్తయితే సోన్‌మార్గ్ నుండి ద్రాస్‌కు ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా చేరుకునే వీలుంటుంది. నియంత్రణ రేఖ (LOC)కి దక్షిణంగా ఉన్న జాతీయ రహదారి-1 కాశ్మీర్‌ను లడఖ్‌ను కలుపుతుంది. కాశ్మీర్, లడఖ్‌లను కలిపే ఈ హైవే 1999 కార్గిల్ యుద్ధం సమయంలో దాడికి గురైంది.

జోజిలా సొరంగం కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలోని బాల్తాల్ నుండి ప్రారంభమై ద్రాస్‌లోని మినీమార్గ్ వరకు 18 కి.మీ అప్రోచ్ రోడ్డును కలిగి ఉంటుంది. ఇది 2028 నాటికి పూర్తి కావొచ్చని అంచనా వేస్తున్నారు.

జడ్‌-మోడ్‌ టన్నెల్, జోజిలా టన్నెల్ వల్ల జమ్మూ , కాశ్మీర్ , లడఖ్ ఉత్తర ప్రాంతాలను భారత సైన్యం ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా చేరుకునే వీలు కల్పిస్తుంది. ఈ రెండు టన్నెల్స్ వల్ల నియంత్రణ రేఖ, వాస్తవ నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం మరింత అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది.

Exit mobile version