Site icon Swatantra Tv

రాయి దాడి జగన్నాటకమా ?

  జగన్మోహన్ రెడ్డిపై దాడిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి జనాదరణ చూసి ప్రతి పక్షాలు ఓర్వలేకనే దాడి చేయించాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కోడికత్తి డ్రామాకు కొనసాగింపే రాళ్లదాడి అని ఎద్దేవా చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. ఎన్నికల్లో సానుభూతి కోసం సరికొత్త నాటకానికి జగన్మోహన్ రెడ్డి తెరలేపారని విపక్షాలు ఎదురుదాడి చేశాయి.

  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే రాజకీయ ప్రత్యర్థులు దాడి చేయిం చారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మరోవైపు రాళ్లదాడిపై అనుమానాలు వస్తున్నాయి. ప్రజల్లో సానుభూతి కోసమే జగన్మోహన్ రెడ్డే కావాలని రాళ్లదాడి చేయించుకున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. రాళ్లదాడి సంఘటన నేపథ్యంలో అనేక అంశాలు తెరమీదకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డిపై ఆగంతకులు రాళ్లు విసిరిన సంఘటనలో భద్రతా వైఫల్యం ఉందని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. రాళ్ల దాడికి ముందు, ఆ తరువాత భద్రతా సిబ్బంది వ్యవహ రించిన తీరు లోపభూయి ష్టంగా ఉందని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి.

  సహజంగా ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో ఎత్తైన భవనాలను ముందే గుర్తిస్తారు. సదరు మార్గంలో ఒకటికి రెండుసార్లు తనిఖీలు చేస్తారు. అయితే బస్సుయాత్ర జరగుతున్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న వివేకానంద పాఠశాల గదులు తెరిచే ఉన్నాయంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. అక్కడ భద్రతా సిబ్బందిని ఎందుకు పెట్టలేదన్న ప్రశ్న తాజాగా తెరమీదకు వచ్చింది. సాధారణంగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న మార్గంలో ముందస్తుగా డ్రోన్ సేవలను ఉపయోగించుకుంటారు. ఆ చుట్టుపక్కల ప్రాంతా లన్నిటినీ, 360 డిగ్రీల కోణంలో చిత్రీకరిస్తారు. ఈ దృశ్యాల సాయంతో ఎక్కడైనా భద్రతాపరంగా సమస్యలు ఉన్నాయా అనేవిషయాన్ని ఒకటికి నాలుగుసార్లు పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో వివేకానంద స్కూల్ భవనం లోపల నుంచి గానీ లేదా భవనం పైనుంచి గానీ ఎవరైనా…రాయి లేదా ఏదైనా వస్తువు విసిరితే ముప్పు ఉండే అవకాశముందని భద్రతా సిబ్బంది ముందే ఎందుకు గుర్తించలేదన్న ప్రశ్న వచ్చింది. ముఖ్యమంత్రి వంటి వీఐపీల భద్రత పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి రాళ్ల దాడి సంఘటన ఒక ఉదాహరణ అని చెబుతున్నారు ప్రతిపక్షాల నేతలు. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డికి తగిలింది అసలు రాయేనా ? అనే అనుమానం కూడా వస్తోంది. రాళ్లదాడి సంఘటనలో జగన్మోహన్ రెడ్డితో పాటు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డ సంగతి తెలిసిందే. వెల్లంపల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

  అసలు జగన్మోహన్ రెడ్డికి గాయం కావడానికి కారణం రాయా ? లేక మరోదైనా వస్తువా ? అనేది ఇప్పటివరకు పోలీసులు తేల్చలేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎయిర్ బుల్లెట్‌, పెల్లెట్, క్యాట్‌బాల్ వంటి వాటితో కొట్టారని ఆరోపిస్తున్నారు. అధికారపార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లు పెల్లెట్‌, ఎయిర్ బుల్లెట్ అయితే ఇప్పటివరకు వాటిని ఎందుకు చూపించలేదని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. ఎన్నికల్లో సానుభూతి కోసమే కొత్త డ్రామాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరలేపారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుం దన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి …ఓ సరికొత్త డ్రామా అని ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఉండే అంబులెన్స్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు.. దాడి జరిగిన పది నిమిషాల్లోనే పోస్టర్లు పట్టుకొని ధర్నా చేయడం చూస్తే అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి డ్రామాలు అవసరమా అని ప్రశ్నించారు పట్టాభి. రాళ్ల దాడి సంఘటన చూస్తుంటే గతంలోని కోడికత్తి సంఘటన గుర్తుకు వస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. కోడికత్తి డ్రామాకు కొనసాగింపే రాళ్ల దాడి సంఘటన అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు.

Exit mobile version