Site icon Swatantra Tv

కేజ్రీవాల్ కి ప్రాణాపాయం ఉందా?

     కేజ్రీవాల్‌ను చంపే కుట్ర జరుగుతోందా..? బీజేపీ ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చే ఎత్తుగడలో ఉందా..? బెయిల్‌ కోసం సీఎం తినకూడనివన్నీ లాగించేస్తున్నారా..? ఇవే అంశాలు ఇప్పుడు ఢిల్లీలోనే కాదు. దేశ రాజకీయాల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారాయి.

   దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు అంతకంతకు హీట్‌ పెంచుతున్నాయి. ఓవైపు కేజ్రీవాల్‌ వర్సెస్‌ ఈడీ, మరోవైపు ఆప్‌ వర్సెస్‌ బీజేపీ ఎపిసోడ్‌తో పొలిటికల్ కాక సెగలు కక్కుతోంది. కేజ్రీవాల్ సర్కార్‌ను ఎలాగైనా గద్దె దించాలన్న వ్యూహంలో బీజేపీ ఉంది. మరోపక్క లిక్కర్ స్కాం పరీక్షను ఎదుర్కొంటూనే, అధికారాన్ని కాపాడుకునే పనిలో ఉన్నారు ఆప్‌ నేతలు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి పాలన సాగించేందుకు జైలు నిబంధనలు అనుమతించకున్నా ఆయన అక్కడి నుంచే పాలన సాగిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా చెబుతూ ప్రత్యామ్నాయ ముఖ్య మంత్రిని ఎన్నుకోవాలంటున్నారు. లేదంటే రాష్ట్రపతి పాలన తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు.

     ఈ పరిణామాల మధ్య కేజ్రీవాల్‌ను చంపే కుట్ర జరుగుతోందని ఆప్‌ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్ట్‌ అయిన ఆయనను జైల్లోనే చంపే పథకం పన్నుతున్నారని, బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఈడీ ఇందుకు సహకరిస్తోందని చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో మరింత దుమారం రేపాయి. ఎన్నికల్లో ఓడించలేక, చంపేందుకు పథకం పన్నుతున్నారని మండి పడ్డారు ఆ పార్టీ నాయకురాలు, మంత్రి అతిషి. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్ అయిన కేజ్రీవాల్‌ పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడం లేదని ఫైర్‌ అయ్యారు. కావాలనే బీజేపీ తన అనుబంధ సంస్థ అయిన ఈడీ ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఈడీ పదే పదే అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. కేజ్రీవాల్ అస్వస్థతతో బాధపడుతుంటే బీజేపీ నేతలు అపహాస్యం చేస్తోందని ధ్వజమెత్తారు మరో ఆప్‌ నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్. ఆయనకు విషం ఇచ్చే కుట్ర జరుగుతోందా అని నిలదీశారు. కేజ్రీవాల్‌కు జైలులో ఏ సమయంలోనైనా ప్రమాదం జరగవ చ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

        ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అయితే, జైల్లో ఆయనకు షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతున్నా యని, దీంతో తనకు ఇంజక్షన్లు ఇవ్వాల్సిందిగా కోర్టును కేజ్రీవాల్‌ కోరారు. అయితే, దీన్ని వ్యతిరేకించిన ఈడీ విచారణ సందర్భంగా పలు ఆరోపణలు చేసింది. ఇంటి భోజనానికి అనుమతి ఉండటంతో మామిడిపండ్లు, స్వీట్లు తినేసి, తద్వారా షుగర్‌ లెవెల్స్‌ పెంచుకొని, ఆరోగ్యపరమైన కారణాలతో బెయిల్‌ పొందాలని ప్రయత్నిస్తున్నారని కోర్టుకు తెలిపింది. అయితే, ఈడీ చేసిన ఈ ఆరోపణలపైనే ఆప్‌ నేతలు మండిపడుతున్నారు. మధుమేహ రోగులకు సిఫారసు చేసే కృత్రిమ చక్కెరను మాత్రమే కేజ్రీవాల్‌ వాడుతు న్నారని డయాబెటిస్‌ పెషంట్‌కి షుగర్‌ స్థాయిలు ఎప్పుడైనా పడిపోవచ్చని, అందుకే అరటి పండ్లు, చాక్లెట్ల వంటివి దగ్గర పెట్టుకోవాలని వైద్యులే సలహా ఇస్తారని, దాన్ని కూడా ఈడీ తప్పుగా చిత్రీక రించి అసత్యాన్ని ప్రచారం చేస్తోందని మంత్రి అతిశీ మండిపడ్డారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ వర్సెస్‌ ఈడీ, ఆప్‌ వర్సెస్‌ బీజేపీ ఎపిసోడ్‌తోరాజకీయ రగడ మరింత రాజుకుంటూనే ఉంది. అయితే, ఆప్‌ నేతలు ఆరోపిస్తు న్నట్టు కేజ్రీవాల్‌పై కుట్ర జరగుతోందా..? ఆప్‌ను ఓడించలేక మర్డర్‌ ప్లాన్‌ చేస్తోందా..? లేదంటే ఈడీ చెబుతు న్నట్టు బెయిల్‌ కోసం కేజ్రీవాల్‌ తినకూడనివన్నీ తినేసి షుగర్‌ పెంచుకునే ప్రయత్నం చేశారా అన్నది రాజకీయవ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Exit mobile version