Site icon Swatantra Tv

విద్వేష ప్రసంగాలే రాజకీయాలా ?

   పదేళ్ళ పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తాను ప్రజలకు చేసిన మేలు ఇదీ అని ఘనంగా చెప్పుకోలేకపోతోంది. అందుకనే సమాజంలో చిచ్చు పెట్టే విద్వేష ప్రసంగాలకు పాల్పడు తోంది. ఇది చాలా ప్రమాదకర ధోరణి. అంతేకాదు. మన రాజ్యాంగ స్ఫూర్తికి, ఎన్నికల నిబంధనావళికి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కూడా పూర్తి విరుద్ధం. ఎన్నికల సమరాంగణంలో నిలబడి, ప్రజల మద్దతు ను ఆశిస్తున్న వేళ తాము గత ఎన్నికల్లో చెప్పిం దేమిటో, పదేళ్ల పాలనలో చేసిందేమిటో వివరంగా చెప్పు కొని, తీర్పును కోరటం ఒక పద్దతి. అయితే ఈ పద్దతికి బీజేపీ తిలోదకాలు ఇస్తోంది.

   రాజనీతిశాస్త్రం ప్రకారం రాజకీయాలంటే ప్రజాజీవనంలో ఉండటం. ప్రజా సమస్యలు పరిష్కరించడం. సామాజిక పరిస్థితులను మరింత మెరుగు పరచడం. ప్రజల ఆర్థిక అభివృద్దికి తోడ్పడటం. అంతేకాదు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం. అయితే ఇప్పుడు రాజకీయాలకు అర్థం మారిపోయింది. రాజకీయా లకు కొత్త నిర్వచనం వెతుక్కోవలసిన అవసరం ఏర్పడింది. ఎన్నికల్లో విజయమే రాజకీయాల అంతిమ లక్ష్యంగా మారింది. స్వలాభం కోసం విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం. ప్రజలను రెచ్చ గొట్టడమే లక్ష్యంగా మారింది. ఇందులో దాదాపుగా ఏ ఒక్క పార్టీకి మినహాయింపు లేదు. ఈ విషయంలో అన్ని పార్టీలు ఒకే రాగం ఆలపిస్తుంటాయి.

   భారతీయ జనతా పార్టీకి చెందిన అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఇటీవల తెలంగాణలో పర్యటించారు. హైదరాబాద్ నగరంలో బీజేపీ అభ్యర్థిని మాధవీలతకు మద్దతుగా నవనీత్ కౌర్ పర్యటించారు. ఈ సందర్భంగా దాదాపు పన్నెండేళ్ల కిందట మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను నవనీత్‌ కౌర్ ప్రస్తావించారు. పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామంటూ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అయితే వాళ్లకు 15 నిమిషాలు కావాలేమో మాకైతే 15 సెకన్లు చాలు అంటూ ఒక సామాజికవర్గాన్ని రెచ్చగొట్టేలా నవనీత్ కౌర్ వ్యాఖ్యా నించారు. నవనీత్ కౌర్ వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపాయి. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ నియోజక వర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. నరేంద్ర మోడీజీ 15 సెకన్లు కాదు. 15 గంటల సమయం తీసుకోండి. అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా.ముస్లింలను ఏం చేస్తారో చేయండి. అసలు మీలో మానవత్వం అనేది ఇంకా మిగిలి ఉందా? లేదా? అనేది మేము కూడా చూడాలనుకుంటున్నాం.అంటూ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు.అసదుద్దీన్ ఒవైసీ అంతటితో ఆగలేదు. తాము ఎవరికీ భయపడేది లేదన్నారు. అమీతుమీకి సిద్దంగా ఉన్నామ న్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం .దమ్ముంటే 15 గంటల్లో ఏం చేస్తారో అది చేయండి అంటూ ఏకంగా బీజేపీ అగ్రనాయకత్వానికే సవాల్ విసిరారు అసదుద్దీన్ ఒవైసీ.

    ఇదిలా ఉంటే అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు గోషామహల్ బీజేపీ ఎమ్మల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. టైం. ఏరియా సెట్‌ చేయాల్సింది ఒవైసీ బ్రదర్సేనన్నారు. ఏరియా సెట్ చేస్తే అక్కడే గిరి గీసుకుని బలాబలాలు చూసుకుందామంటూ ఒవైసీ బ్రదర్స్‌కు రాజాసింగ్ సవాల్ విసిరారు. నవనీత్ కౌర్ వర్సెస్ అసదుద్దీన్ ఒవైసీ సవాళ్లు, ప్రతిసవాళ్లు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఉభయ పార్టీల నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలపై సామాజికవేత్తలు మండిపడ్డారు. హైదరాబాద్ నగరం మత సామరస్యానికి పెట్టింది పేరన్న సంగతి సామాజికవేత్తలు ఈ సందర్బంగా గుర్తు చేశారు. గంగా, జమున తహెజీబ్‌ ఉన్న నగరంగా హైదరాబాద్ సిటీ దేశమంతా పాపులర్ అనే విషయం మరోసారి గుర్తు చేశారు. మఖ్డూం మొహియుద్దీన్ వంటి హైదరాబాద్‌ మూలాలున్న ముస్లిం కవులు ఎంతోమంది మత సామరస్యం కోసం పాటుపడ్డ విషయాన్ని గుర్తు చేశారు. అటువంటి హైదరాబాద్‌ నగరంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ఇటు బీజేపీ, అటు మజ్లిస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు సామాజికవేత్తలు.

   వాస్తవానికి హైదరాబాద్ నియోజకవర్గం బాగా వెనుకబడింది. మిగతా ప్రపంచమంతా అభివృద్ధి బాటలో పరుగులు తీస్తుంటే, హైదరాబాద్ నియోజకవర్గం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అనే చందంగానే ఉంటుంది. హైదరాబాద్ నియోజకవర్గంలో ఎటు చూసినా ఇరుకు రోడ్లే కనిపిస్తుంటాయి. నియోజక వర్గంలో మౌలిక సదుపాయాలు కూడా తక్కువ. ప్రజల జీవన ప్రమాణాలు కూడా దుర్బరంగా ఉంటాయి. అంతేకాదు హైదరాబాద్ నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు ముస్లింలు. అయితే అనేక అసెంబ్లీ నియోజకర్గాల్లో హిందువులు కూడా ఉంటారు. అయితే హిందువుల జనాభా తక్కువగా ఉంటుంది. ఎవరు ఎంత సంఖ్యలో ఉన్నారనే విషయం పక్కనపెడితే, హైదరాబాద్ నగరంలో గత పదేళ్లుగా ప్రశాంతంగా ఉంది. ఎక్కడా ఎటువంటి మత ఘర్షణలు జరగలేదు. రంజాన్ పండగ వస్తే ముసల్మానుల ఇండ్లకు హిందూ సోదరులు వెళతారు. డబుల్ మీఠా తిని ఎంజాయ్ చేస్తారు. బోనాల పండగ వస్తే హిందువుల ఇండ్లకు ముసల్మానులు వెళతారు. కలసిమెలసి జీవిస్తుంటారు. అటువంటి ప్రశాంత వాతావరణంలో చిచ్చు పెట్టడానికి అమరావతి నుంచి వచ్చిన నవనీత్ కౌర్ ప్రయత్నించారని మండి పడ్డారు సామాజికవేత్తలు.

   ఏమైనా, సమాజంలో విద్వేషం రాజ్యమేలుతోంది. సమాజంలో విషం చిమ్మే ప్రసంగాలు ఎక్కువ అవుతున్నాయి. ఓట్ల రాజకీయం కోసం అప్పటివరకు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండే ప్రజల మధ్య రాజకీయ నాయకులు చిచ్చు పెడుతున్నారు. కొంతమంది హిందూ ఓట్‌బ్యాంక్ పోలరైజేషన్‌ కోసం విద్వేష ప్రసంగాలు చేస్తుంటే మరికొంతమంది ముస్లిం మైనారిటీల్లో మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయ తెరమీద విద్వేషపూరిత ప్రసంగాలు రాజ్యమేలు తుండడం తో అసలు సమస్యలు గాలికి ఎగిరిపోతున్నాయి. ఇరుకు రోడ్లను విశాలం చేయాలన్న డిమాండ్ నిర్లక్ష్యానికి గురవుతోంది. డ్రైనేజీ దురవస్థ అంశానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వారి పిల్లల కోసం స్కూళ్లు, దవాఖానాలు ఏర్పాటు చేయాలన్న ధ్యాస ఎవరికీ లేకుండా పోతోంది. అంతిమంగా నువ్వెంత అంటే నువ్వెంత అనే చిల్లర భాష, ద్వేష పూరిత ప్రసంగాలే హల్‌చల్ చేస్తున్నాయి. విషం చిమ్మే ప్రసంగాలు చేసే నాయకులు ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితం కాదు. అన్ని రాజకీయపార్టీల్లోనూ ఈ తరహా నాయకులు ఉన్నారు. విచక్షణ కోల్పోయి చేసే ఇలాంటి వ్యాఖ్యల వల్ల సమాజం ఆగమాగం అవుతోంది. అసలు ప్రజా సమస్యలు పక్కకు పోతున్నాయి. అంతిమంగా విద్వేషమే రాజ్యమేలుతోంది.

Exit mobile version