Site icon Swatantra Tv

ఉత్తర ప్రదేశ్ లో బీజేపీకి క్లీన్ స్వీప్ సాధ్యమేనా ?

   యూపీని కొడితే.. ఢిల్లీ గద్దెపై పాగా వేసినట్లే. అన్నిపార్టీల నిశ్చితాభిప్రాయం ఇది. అందుకే బీజేపీ ఉత్తర ప్రదేశ్ లో 80 కి 80సీట్లు గెలుస్తామంటూ… ప్రచారంలో ఊదరగొడుతోంది. ఫలితంగా రాష్ట్ర రాజకీయాలు రసవత్తర ఘట్టానికి చేరాయి. ఇండియా కూటమి బలమైన పోటీ ఇస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నవేళ.. 80 సీట్లు సాధ్యమా.. ఒకపక్క ప్రభుత్వ వ్యతిరేకత, మరోపక్క ముస్లీంలను పూర్తిగా దూరం పెట్టిన బీజేపీ.. ఏ ధైర్యంతో 80 అంటోంది. పౌరసత్వ సవరణచట్టం, రామ మందిరంతో ఓట్లు కొల్లగొట్టవచ్చని భావిస్తోందా.. లోక్ సభ ఎన్నికల వేళ అన్నీ ప్రశ్నలే.

   2024లో రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ లో మొత్తం 80 లోక్ సభ స్థానాలను గెలిచే లక్ష్యంతో ప్రధాని మోదీ, అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హల్ చల్ సృష్టిస్తున్నారు. మోదీ ప్రభంజనం లో కూడా బీజేపీ ఉత్తరప్రదేశ్ లో 80కి 80సీట్లు గెలవలేదు. 2014 లో బీజేపీ యూపీలో అత్యధికంగా 73 స్థానాలను గెలుచుకుంది. 2019లో ఎన్డీఏ గెలిచిన స్థానాలు 64కు పడిపోయాయి. ఈ పదేళ్లలో కేంద్రంలోని మోదీ, యూపీలోని అదిత్యనాథ్ ప్రభుత్వ వ్యతిరేకత కూడా హెచ్చింది. ఈ నేపథ్యంలో 80 సీట్లు సాధించడం ఎన్డీఏకు ఎలా సాధ్యం.

   కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఈ సారి రాయ్ బరేలీ నుంచి పోటీ చేయడంలేదు. రాహుల్ గాంధీ కేరళలోని వయినాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. అమేథి నుంచి పోటీ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రియాంకగాంధీ, రాబర్ట్ వద్రాలలో ఎవరైనా పోటీలో దిగుతారా అన్నది స్పష్టం కాలేదు. కాగా, పిలిభిత్ నుంచి వరుణ్ గాంధీకి కానీ, మేనకా గాంధీకికానీ బీజేపీ టికెట్ ఇవ్వలేదు. మేనక సుల్తాన్ పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంతో రాయ్ బరేలీ, అమేథీతో సహా మొత్తం 80 స్థానాలు గెలుస్తామని రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఇండియా కూటమి లోని ఆమ్ ఆద్మీపార్టీ యూపీ ఎన్నికల్లో అటు ఎస్పీ, ఇటు కాంగ్రెస్ పార్టీలకు బేషరతుగా మద్దతు ప్రకటించింది. అది కూటమికి ప్లస్ పాయింట్ .

   ఉత్తరప్రదేశ్ లో ఏడు దశల్లో 80 నియోజకవర్గాలకు 2024 లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న తొలిదశలో 8 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 26న రెండో దశలో 8 నియోజకవర్గాలు, మే 7న మూడోదశలో 10, మే 13న నాల్గో దశలో 13 నియోజకవర్గాలు, మే 20న ఐదో దశలో 14 స్థానాలు, మే 25న ఆరో దశలో 14 నియోజకవర్గాలు, జూన్ 1న చివరి ఏడో దశలో 13 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తవుతాయి. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్డీఏ కూటమి మొత్తం 80 స్థానాలకు పోటీ చేస్తోంది. ఇండియా కూటమి లో సమాజ్ వాదీ పార్టీ, 61 స్థానాలు, కాంగ్రెస్ 17, రెండు చిన్న పార్టీలకు 2 స్థానాలు కేటాయించారు. మాయావతి ఆధ్వర్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమికి దూరంగా ఒంటరిగా పోటీ చేస్తోంది.

  సమాజ్ వాదీ పార్టీ రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించి 25-31 ఏళ్లలోపు యువకులను ఎన్నికల గోదాలో దింపింది. విద్యావంతులు, సోషలిస్ట్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఇక్రా హసన్ , శ్రేయా వర్మ, ప్రియా సరోజ్, పుష్పేంద్ర సరోజ్ లను ఎస్పీ అభ్యర్థులుగా ప్రకటించింది. యువ నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. బీజేపీ 80 సీట్ల లక్ష్యానికి పెద్ద అవరోధం ముస్లింలు అత్యధికంగా ఓట్లు కలిగిన పలు నియోజకవర్గాలు. దాదాపు 16 నియోజకవర్గాల్లో బీజేపీకి గడ్డు సమస్యే. రాయ్ బరేలీ, అమేధి, ఫైజాబాద్, అంబేద్కర్ నగర్, కౌశంబి వంటి లోక్ సభ స్థానాల్లో బీజేపీ విజయం ఆశామాషీ కాదు. అయితే ఎంఐఎంవంటి ఇతర పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చడంతో బీజేపీ లాభపడిన సందర్భాలు ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ హయాంలో తమపై దాడులు పెరిగాయని ముస్లీం సంస్థలు ఆరోపిస్తు న్నాయి. ట్రిపుల్ తలాక్ విషయంలోనూ ముస్లీంలలో మెజారిటీ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. సీఎఏ ను మెజారిటీ ప్రతి పక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

  ఉత్తర ప్రదేశ్ లో నిరుద్యోగం, పేదరికం అతి పెద్ద సమస్యలు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పాలనలో మతపరమైన వివక్ష పెరిగిపోయింది. ఎలక్టోరల్ బాండ్ల విషయం పై కేంద్రప్రభుత్వం జోక్యంతో ఎన్డీఏ సర్కార్ పరువు పోయింది. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి ఏజెన్సీలను రాజకీయ కక్ష సాధింపు కోసమే వాడుకుంటుందనే చర్చ సాగుతోంది. ఇవన్నీ బీజేపీ విజయాలకు అవరోధాలే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతం అయినా అది కాంగ్రెస్ కు ఓట్ల పరంగా ఏమేరకు విజయం తెచ్చిపెడుతుందో చూడాలి. ఏది ఏమైనా.. ఈ ఎన్నికలు సమాజ్ వాదీ పార్టీకి, కాంగ్రెస్ కు అటు బీజేపీకి అగ్నిపరీక్షే.

Exit mobile version