హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తమ భూభాగంలోనే హమాస్ నేతను హత్యచేయడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేపోతోంది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్‌లో జరిగిన దాడిలో హనియా చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ప్రతీకారానికి ఇరాన్ సిద్ధమయ్యింది. టెల్ అవీవ్‌పై నేరుగా దాడికి ఇరాన్ సుప్రీమ్ నేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
హనియా హత్యకు గురైనట్టు ప్రకటన చేసిన కొద్దిసేపటికే జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటుచేసిన ఖమేనీ.. ఈ మేరకు ఆదేశాలు జరాచేసినట్టు తెలుస్తోంది. హనియాను ఇజ్రాయెల్ హత్య చేసిందని ఇరాన్, హమాస్ ఆరోపిస్తున్నాయి. గత అక్టోబరు నుంచి గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకూ టెల్ అవీవ్ స్పందించలేదు. ఖండించడంగానీ తామే దాడిచేశామనిగానీ చెప్పలేదు. ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి హాజరై ఇంటికి తిరిగొచ్చిన వెంటనే హమాస్ చీఫ్ హత్యకు గురయ్యారు.
గాజాలో దాదాపు 10 నెలల యుద్ధం తర్వాత ఇరాన్ సమతౌల్యతను సాధించడానికి ప్రయత్నించింది. తాజాగా హమాస్ చీఫ్ హత్యపై చేసిన బహిరంగ ప్రకటనలో ఇరాన్ నేరుగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఖమేనీ సంకేతాలు ఇచ్చారు.. ‘అతడి రక్తానికి ప్రతీకారం తీర్చుకోవడం మా బాధ్యత’ అని నొక్కిచెప్పారు. తమ భూభాగంలో జరిగిన ఈ ఘటనతో ఇజ్రాయెల్ కఠినమైన శిక్షను స్వీకరించడానికి వేదికను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఖమేనీతో పాటు ఇరాన్ నూతన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, విదేశాంగ శాఖ, రివల్యూషనరీ గార్డ్స్, ఐరాసలోని ఇరాన్ మిషన్ సైతం ఇస్మాయిల్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ప్రకటించాయి. దీంతో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.