Site icon Swatantra Tv

రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు – సీఎం రేవంత్‌

అదానీ గ్రూప్‌పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి ఇటీవల అదానీ గ్రూప్‌ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అదానీ ఫౌండేషన్‌ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ అదానీ గ్రూపునకు లేఖ పంపినట్లు సీఎం తెలిపారు. రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ ఖాతాల్లోకి ఎవరి నుంచీ డబ్బులు రాలేదని సీఎం స్పష్టం చేశారు.

ఇక, తన ఢిల్లీ పర్యటనకు రాజకీయాలతో సంబంధంలేదని సీఎం రేవంత్ తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమే ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు. పార్లమెంటు సమావేశాలపై ఎంపీలతో చర్చిస్తామన్న సీఎం… అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యల్ని వివరిస్తామని చెప్పారు. 28 సార్లు ఢిల్లీ వెళ్లానని కొందరు విమర్శిస్తున్నారు. నేను వారిలా పైరవీలు చేయడానికో.. బెయిల్‌ కోసం ఢిల్లీకి వెళ్లలేద్దని ఎద్దేవా చేశారు.

Exit mobile version