Site icon Swatantra Tv

వైసీపీ భూ కబ్జాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ..?

వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసే యోచనలో చంద్రబాబు సర్కార్ ఉంది. నేడు జరగనున్న చంద్రబాబు సమీక్షలో కూడా రెవెన్యూ శాఖ ఇదే విషయాన్ని ప్రతిపాదించనుంది. ఇక సీనియర్ ఐఏఎస్, మరో సీనియర్ ఐపీఎస్‌లు కమిటీలో ఉండే విధంగా ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల భూకబ్జాలపై ఆధారాలతో సహా కుప్పలు తెప్పలుగా కూటమికి, ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. మొన్న మదనపల్లి ఘటనలో అక్కడకు వెళ్లిన సిసోడియాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మరోవైపు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మంత్రులకు కూడా భూకబ్జాలపై ఫిర్యాదులు అందాయి. టీడీపీ కేంద్ర కార్యాలయానికి భారీగా ఫిర్యాదులు అందడంతో ఉన్నత స్థాయి విచారణ జరిపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విలువైన ప్రభుత్వ భూములను పరాధీనం చేసి.. ప్రైవేటు భూములను ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ నేతలు చేతుల్లోకి తీసుకున్నారని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర హైకోర్టు సిటింగ్‌ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ కమిటీ రాష్ట్రంలోని బాధితులు ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్లి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది. రాష్ట్రంలో వైసీపీ నేతల భూ అక్రమాలు, పేదలపై వారు చేసిన అరాచకాలపై సమగ్ర విచారణ ఉంటుందని ఈ నెల 15వ తేదీన చంద్రబాబు ప్రకటించారు.

ఆ తర్వాత కొద్దిరోజులకే ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులకు అగంతకులు నిప్పుపెట్టారు. భూ అక్రమాలు, దందాలు బయటకు రాకుండా ఉండేందుకే కుట్రపూరితంగా సబ్‌కలెక్టర్‌ ఆఫీసుకు నిప్పుపెట్టారని రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.పి.సిసోడియా ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చారు. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న సమీక్షలో మరో నివేదికను ఆయన ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఐదేళ్లుగా సాగిన రాజకీయ నేతల భూ ఆక్రమణలు, దౌర్జన్యాలపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. కమిటీకి సహకరించేందుకు, చట్టబద్ధంగా, అధికారికంగా కేసుల పరిష్కారానికి వీలుగా జోన్‌ల వారీగా క్వాజీ జ్యుడీషియల్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించనుంది.

Exit mobile version