Site icon Swatantra Tv

పెరిగేవి ఏమిటి? తరిగేవి ఏమిటి?

కిచెన్ చిమ్నీపై ప్రేమ

union budget 2023-24 date: కేంద్ర బడ్జెట్ లో…నిర్మలమ్మ ఇంటినెలా చక్కబెట్టారంటే…కొన్నింటిలో పెంచారు. కొన్నింటిలో తగ్గించారు. ఏవైతే తక్కువ ఆదరణ ఉన్నాయో వాటికి సబ్సిడీలు అందించారు. అలాంటి వాటిలో కిచెన్ చిమ్నీలు ఒకటి…భారతదేశంలో ఉన్నత వర్గాలకే పరిమితమైన వీటిని మధ్యతరగతి మహిళలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు, వాటి ధరలను తగ్గించే ప్రయత్నం చేశారని నిపుణులు అంటున్నారు. ఒక మధ్యతరగతి గృహిణిలా ఆలోచించారని చెబుతున్నారు.

సిగరెట్టు అలవాటుందా?

ఇకపోతే పెరిగే వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే సిగరెట్లు ఉన్నాయి. ఇప్పటికే  అత్యధికంగా ఒక సిగరెట్ ధర రూ.18 నుంచి రూ.20 మధ్యలో ఉన్నాయి.ఇప్పుడు వీటి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇలా పెంచుకుంటూ వెళితే…కాల్చడం తగ్గిస్తారని నిర్మలమ్మ అనుకుంది. కానీ ధరలు పెంచేకొద్దీ రెచ్చిపోయి మరీ కాల్చేస్తున్నారనే సంగతి అమ్మకి ఎప్పుడు తెలుస్తుందోనని కొందరు వ్యాక్యానిస్తున్నారు.

బ్రాండెడు…బ్యాండ్

బ్రాండెడ్ దుస్తులు కొనాలంటే బ్యాండ్ పడక తప్పదు. అలా సరదాగా మాల్స్ కి వెళ్లి లేదంటే సొసైటీలో ప్రెస్టేజ్ కోసం బ్రాండెడ్ దుస్తులని ఎక్కువ మంది కొంటూ ఉంటారు. ఇప్పుడలా సరదాగా వెళ్లి షాపింగ్ చేయడం కుదరకపోవచ్చు. ఎందుకంటే ధరలు పెరిగే వాటిలో బ్రాండెడ్ దుస్తులు కూడా ఉన్నాయి. అసలే వాళ్లు షోరూం రెంట్ లు, జీతాలు, ఏసీలు, మెయింటినెన్స్ ఖర్చులన్నీ వేసుకుంటారు. ఇప్పుడు ధరలు పెరిగాయంటే కొనుగోళ్లు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు.

ఇక బంగారమే….

బంగారం, వెండి, డైమండ్స్ పై ధరలు పెరిగినట్టు నిర్మలమ్మ చెప్పింది. అంటే అక్కడ ఆదాయ పన్నులో మినహాయింపులు ఇచ్చారు కాబట్టి, అక్కడ మిగిలిన డబ్బులు చాలామంది కచ్చితంగా బంగారం లేదా వెండి, లేదా డైమండ్స్ ఇలా ఖర్చు చేస్తారు కాబట్టి, ఇటు నుంచి లాగుదామని చూశారేమోనని కొందరు కామెంట్ చేస్తున్నారు. అలా ఇచ్చి ఇలా లాగుతారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

వాహనాల టైర్ల ధరలు పెరిగాయి…

మీ బైక్ లేదా కారు టైర్లు మార్చాలంటే ఇక నుంచి కష్టమే…ఇక చిన్నచిన్న పనులకి బండేసుకుని రయ్ మంటూ వెళ్లడం తగ్గిస్తే మంచిదని అంటున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరుపై కస్టం డ్యూటీ పెంచారు. ఇది ప్రజలపై పరోక్షంగా ఎలాంటి ప్రభావం చూపించినా ప్రత్యక్షంగా కనిపించదని అంటున్నారు.

ఇప్పుడు తగ్గించినవాటిలో ముఖ్యమైనవి చూద్దాం…

శుభవార్త…

నిజంగానే భారతీయులందరికీ శుభవార్త. మొబైల్ ఫోన్లు, టీవీల ధరలు తగ్గాయి. ఇవి రెండు మధ్యతరగతి వారికి ఉపయోగపడేవే. ఎన్నాళ్ల నుంచో పాత టీవీ మార్చేసి పెద్ద టీవీ కొనుక్కోవాలని అనుకునేవారికి సంతోషాన్నిచ్చే వార్తగా చెప్పాలి. పిల్లలు, పెద్దలు అందరికీ మొబైల్ ఫోన్ లేనిదే క్షణం గడవదు. అందుకని వారు కూడా ఎగిరి గంతేసే అవకాశం ఉంది.

ఎలక్ట్రికల్ వాహనాల ధరలు తగ్గింపు

కాలుష్య నివారణ కోసం ఒకటి, రెండు పెట్రోలు, ఢీజిల్ వినియోగాన్ని తగ్గించాలని చూస్తున్నారు. ఎందుకంటే విదేశీ మాదక ద్రవ్యంలో ఈ రెండింటిపైనే ఎక్కువ భాగం ఖర్చవుతోంది. దీనిని తగ్గించుకునే క్రమంలో ఎలక్ట్రికల్ వాహనాల ధరలను సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్మలమ్మ భావించినట్టుంది. అందుకని వీటి ధరలు తగ్గించారు.

మేకప్ కిట్లు తగ్గుతాయి

విదేశాల నుంచి దిగుమతి అయ్యే పలు రకాల వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించనున్నారు. దీనివల్ల చాలా ఉత్పత్తులు ధరలు తగ్గుతాయని, ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ముఖ్యంగా మహిళల మేకప్ కిట్లు తగ్గుతాయని ఆశిస్తున్నారు.

ఇన్వర్టర్ల ధరలు తగ్గుతాయి

లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీని 21 శాతం నుంచి 13శాతానికి తగ్గించారు. దీనివల్ల మన ఇళ్లల్లో కరెంటు పోగానే ఉపయోగించే ఇన్వర్టర్ల ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే ఎలక్ట్రికల్ వాహనాలు ఉంటే, ఆటోమేటిక్ గా ఆ బ్యాటరీలు తగ్గుతాయని చెబుతున్నారు.

నిర్మలమ్మ బడ్జెట్ లో ముఖ్యంగా మధ్యతరగతి జీవులకు చెప్పుకో తగ్గవి పెరిగేవి, తరిగేవి ఇవే అని చెప్పాలి. ఇక ఇక్కడ నుంచి వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తమ బడ్జెట్ ని చూసుకుని, కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు.

Exit mobile version