Site icon Swatantra Tv

స్వతంత్ర సంక్షిప్త వార్తలు 

ముక్కు నేలకు రాస్తా..

వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పై KSR ట్రస్ట్‌ ఛైర్మన్‌ శరత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేసారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 50 వేల మెజారిటీ వస్తే  ముక్కు నేలకు రాస్తానన్నారు. రానిపక్షంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ముక్కు నేలకు రాస్తాడా అంటూ సవాల్‌ విసిరారు. 

ఉత్కంఠకు తెర 

నరసాపురం స్ధానం నుంచి మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు పోటీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ కు మద్దతుగా నరసాపురంలో జరిగిన సమావేశంకు మాధవనాయుడు హాజరై ఊహాగానాలకు తెరదించారు.  పార్టీలో వర్గాలు వద్దు..సమిష్టిగా కలసి పనిచేయాలన్నారు మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ. 

అండగా ఉంటా..

క్షత్రియ అగ్ని కులస్తులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు చిత్తూరు నియోజ కవర్గ టిడిపి అభ్యర్థి గురజాల జగన్నాథం. గురజాల ట్రస్ట్‌ ద్వారా మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసారు. ఎకరం స్ధలంలో వయోవృద్ధులకు భవనం, మిగిలిన రెండు ఎకరాల్లో కళ్యాణమండపం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ భవనాలను నిర్మిస్తానంటూ హామీ ఇచ్చారు.

ఓట్ల చీలికపై ఆందోళన

అదిలాబాద్‌ పార్లమెంట్ బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధి ఆత్రం సక్కుకు నేతల రాజీనామాలు పెద్ద తలనొప్పిగా మారాయి.  పార్టీ మారిన కోనేరు కోనప్ప విఠల్‌ రెడ్డి తదితర నేతలు బీఆర్‌ఎస్‌ ఓటమియే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరో నేత గూడెం నగేష్ బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉండటంతో ఓట్ల చీలిక సక్కును వెంటాడుతోంది. 

వైసీపీకి చుక్కెదురు 

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన సతీమణి, వైసీపీ అభ్యర్ధి విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారాన్ని చేపట్టగా స్ధానికుల నుండి నిరసన వ్యక్తమైంది. టిడిపికే తమ ఓటు అంటూ స్పష్టం చేసారు స్ధానికులు.

అధినేతతో మాట్లాడతా… 

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు మైలవరం టీడీపీ అభ్యర్ధి వసంత కృష్ణప్రసాద్‌.  సూపర్‌ సిక్స్‌ పధకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్ధించారు. వీటీపీఎస్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ విషయం పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడి విధానపరమైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు.

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం 

తిరుపతి నియోజకవర్గoకి సంబంధించి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ తెలిపారు. ఈనెల 25 వరకు కొనసాగుతుందన్నారు. నకిలీ ఓట్ల పై విచారణ జరుగుతున్న సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వాటి పరిశీలనను సీ.ఈ.సీ చూస్తోందన్నారు.

5గురికి మించి ఉండరాదు

అభ్యర్ధులు నామినేషన్‌ వేసేటప్పుడు 5గురికి మించి ఉండరాదన్నారు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఆర్డిఓ మనోజ్ రెడ్డి. నామినేషన్ వేసే ప్రాంతానికి 200 మీటర్ల అవతలనే ప్రచారాలు ఉండాలన్నారు. లేదంటూ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయన్నారు. 

బైఠాయింపు 

బొగ్గు బూడిద రవాణాను నిలిపి వేయాలంటూ ఇల్లెందు వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.  వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి బైఠాయించి లారీలను అడ్డుకున్నారు. వాహనాల ప్రమాదాలతోపాటు, కళ్ళల్లో పడుతున్న బూడిద వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

దర్గాలో నవమి వేడుకలు 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురంలోని దర్గాలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి.  హిందూ, ముస్లింల ఆరాధ్య దైవం హజ్రత్ నాగుల్ మీరా దర్గాలో సీతాకళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. దర్గా మాలిక్  ఆధ్వర్యంలో బ్రాహ్మణోత్వంలో మంత్రోత్సరణ మధ్యన కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. హిందూ ముస్లింల ఐక్యతను చాటారు. 
రౌడీ షీటర్లపై నిఘా
హైదరాబాద్‌ బోరబండ, మధుర నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లను పోలీసులు బైండోవర్‌ చేసారు. పరారీలో ఉన్న తన్నుఖాన్,  రేప్ కేసులో నిందితుడుగా ఉన్న విజయ్ సింహ కోసం గాలిస్తున్నట్లు పంజాగుట్ట, ఎస్సార్‌నగర్‌ ఏసీపీలు తెలిపారు. పాత నేరస్తులపై ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిఘా ఉంచినట్లు తెలిపారు.

నవమి వేడుకల్లో అపశృతి

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం రామిరెడ్డి పల్లెలో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి ఊరేగింపులో విద్యుత్ తీగలు తగిలి చంద్రఓబుల్ రెడ్డి అనే 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వార్ని చికిత్సకై ఆస్పత్రికి తరలించారు. 

ఆటో బోల్తా

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెంకు కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిమంది కూలీలు గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీర్ని తాలకుంట తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు. 

భారీ శబ్దాలు – ఎగసిపడ్డ మంటలు

నంద్యాల జిల్లా ఆత్మకూరులో అగ్ని ప్రమాదం సంభవించింది. పాత సామాను గోడౌన్ లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలాయి.  దీంతో భారీ శబ్దాలతో మంటలు ఎగసిపడటంతో స్ధానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటల్ని అదుపుచేసారు. 

బస్సు ప్రమాదం – ఇద్దరు మృతి

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచేర్ల మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అతివేగం గా వచ్చిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు కల్వర్టును ఢీకొంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ శ్రీనివాసరావు,  ప్రయాణీకుడు రాములు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురు ప్రయాణీకుల్ని చికిత్సకై ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టా రు పోలీసులు. 
Exit mobile version