Site icon Swatantra Tv

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

భర్తతో గొడవపడి ఇద్దరు కుమార్తెలతో సహా వివాహిత నందిని అదృశ్యం

భర్తతో గొడవపడిన మహిళ తన ఇద్దరు కుమార్తెలతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సబిత కథనం ప్రకారం.. సికింద్రాబాద్ వారాసిగూడ ఇందిరానగర్ వాసి కే.నందిని తన భర్త నరసింహతో గొడవపడి ఈనెల 21న కుమార్తెలు 11 ఏళ్ల అక్షయ, ఎనిమిదేళ్ల సుజాతతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎక్కడ వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో భర్త నరసింహ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 040-27853597కు ఫోన్ చేయాలని ఎస్ఐ సూచించారు.

కోదాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అగ్నిప్రమాదం

సూర్యాపేట జిల్లా కోదాడలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో కోర్టు బీరువాలోని ఫైల్స్ కాలి బూడిద అయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు, విద్యుత్‌శాఖ అధికారు లు ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అర్ధరాత్రి ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. కోర్టులో అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రిస్కిప్షన్‌ లేకుండా ఇంజక్షన్ల అమ్మకం

మెఫాటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రేష్మి పెరుమాళ్ తెలిపారు. కండరాలు పెరిగేందుకు ఈ ఇంజక్షన్లను బాడీ బిల్డర్లు వాడతారని చెప్పారు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ. వైద్యుల ప్రిస్కిప్షన్‌ లేకుండా ఈ ఇంజక్షన్లను వాడకూడదన్నారు రేష్మి పెరుమాళ్‌. అలాంటి ఇంజక్షన్లను నిందితులు అక్రమంగా విక్రయిస్తున్నాడని చెప్పారు. ఆసిఫ్‌నగర్‌లో పల్స్ ఫిట్నెస్ జిమ్ నిర్వాహకుడు నితేష్‌ సింగ్‌ ప్రధాన నిందితుడని, రిసెప్షనిస్టులు సయ్యద్ జాఫర్ అలీ, రాహుల్ సింగ్‌ ఇంజక్షన్లు అమ్ముతున్నారని వెల్లడించారు. వారి వద్ద 75 ఇంజక్షన్లు సీజ్‌ చేసినట్లు తెలిపారు.

సత్తుపల్లి 8వ వార్డు కౌన్సిలర్‌ చాంద్‌ పాషాపై యువకుల దాడి

ఖమ్మంజిల్లా సత్తుపల్లి 8వ వార్డు కౌన్సిలర్ చాంద్ పాషాపై కొందరు యువకులు దాడిచేసి, గాయపరిచా రు. దీంతో చాంద్ పాషా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తన మెకానిక్ షాప్ నుండి వస్తున్న చాంద్ పాషాపై హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద కొందరు యువకులు దాడి చేశారు. గాయపడ్డ చాంద్ పాషాని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. చాంద్ పాషా చాలా సౌమ్యుడని ఆయన భార్య చెప్పారు. ఎవరితోనూ గొడవ పడని తన భర్తపై దాడిచేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దాడిచేసి న వారిని శిక్షించాలని పోలీసులను కుటుంబం వేడుకుంది.

ఈ నెల 23న జరిగిన చోరీ కేసు ఛేదించిన పోలీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో జరిగిన చోరీ కేసును ఛేదించినట్లు భువనగిరి జోన్ డీసీపీ రాజేశ్‌ చంద్ర తెలిపారు. శ్రీ దుర్గా వైన్స్‌లో ఈ నెల 23 అర్ధరాత్రి దొంగతనం జరిగింది. దొంగలు 3 లక్షల 47 వేల 600 నగదు, ఎనిమిది మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. మూడు బృందాలతో విచారణ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. సీసీ ఫుటేజి ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. వైన్స్‌ షాపు షట్టర్‌ వంచి,లోనికి వెళ్లిన రవి, హరీష్ దోపిడీ చేసినట్లు రాజేష్‌చంద్ర వివరించారు. నిందితుల నుంచి 2 లక్షల 4 వేల నగదు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

వాలంటీర్లను టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్‌ అన్న బొజ్జల

పేదల ఇంటికే వాలంటీర్లు వెళ్లి, నిస్వార్థంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఎమ్మెల్యే వెంకట్‌గౌడ్‌ చెప్పారు. వాలంటీర్లను టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్‌ అని‌ శ్రీకాళహస్తి టీడీపీ ఇంచార్జ్ బొజ్జల సుధీర్ ఆరోపించడం తగదన్నారు. సుధీర్‌ బరితెగించి వ్యాఖ్యలు చేశారని ఆయన ఖండించారు. నవరత్నాల పథకాలు, పరిపాలన సంస్కరణలను వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే ‘వాలంటీర్ వ్యవస్థ’ అన్నారు. చంద్రబాబు హయాంలో నియమించిన జన్మభూమి కమిటీలు ఆ పార్టీ అధికారం కోల్పోవడానికి కారణమని అన్నారు.

Exit mobile version