ఇటీవల పలు నిర్మాణ సంస్థలు, నిర్మాతల ఇళ్లపై ఐటీ, జీఎస్టీ అధికారులు దాడులు జరపడంతో నిర్మాతలు అలర్ట్ అయ్యారు. లెక్కలన్నీ కచ్చితంగా ఉండేలా, సమయానికి టాక్సులు కట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్‌లోని నిర్మాతలందరికీ ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు దిల్ రాజు, గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ మూకాంబికేయన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేయడానికి వివిధ గడువు తేదీల గురించి సభ్యులకు వివరించారు. సినిమాల నిర్మాణ వ్యయం, రాబడికి సంబంధించిన అకౌంటింగ్, రాబడుల అడ్మిషన్ మొదలైన వాటికి సంబంధించి చిత్ర నిర్మాతలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలను విశదీకరించారు. ఐటీ రిటర్న్స్‌కు సంబంధించి సవరించిన 52A ఫామ్ వివరాలను నిర్మాతలకు తెలియచేశారు. అనంతరం నిర్మాతలు తమకున్న సందేహాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సినిమా నిర్మాణానికి సంబంధించిన వివిధ ఆదాయపు పన్ను సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఆదాయపు పన్ను శాఖ ఈ రకమైన ఔట్ రీచ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి అవగాహన సదస్సుల ద్వారా నిర్మాతలు ఆదాయపు పన్ను చట్టం, ఆదాయపు పన్ను నియమాల తాజా నిబంధనలను వివరముగా తెలుసుకునే అవకాశం దక్కిందని తెలిపారు. నిర్మాతలందరూ ఆదయపన్నును సక్రమంగా, సకాలంలో చెల్లించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయని చెప్పారు.