Site icon Swatantra Tv

హెచ్‌ఎండీఏ భూములు మళ్లీ వేలానికి?

హైదరాబాద్‌ నగరం, శివారు భూముల వేలానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి హెచ్‌ఎండీఏ మల్లగుల్లాలు పడుతోంది. ఈ మధ్య కాలంలో స్థిరాస్తి మార్కెట్‌లో ఏర్పడిన స్తబ్దత ప్రభావంతో వేలం నిర్వహిస్తే ఇబ్బందిగా మారుతుందని ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏకు రూ.20వేల కోట్లు అత్యవసరం. వాటి సమీకరణకు భూముల వేలం అనివార్యమైంది. నిధుల సమీకరణకు ప్లాట్లు వేలం వేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

హెచ్‌ఎండీఏ పరిధిలో దాదాపు వేయి ఎకరాలకు పైనే భూములు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని లేఅవుట్లలో ప్లాట్లు విక్రయించగా అందులో కొన్నింటికి డబ్బులు చెల్లించకపోవడంతో కేటాయింపులు రద్దయ్యాయి. అలాంటి వాటిని 500 వరకు గుర్తించారు. వీటిని విక్రయిస్తే వేయి కోట్ల పైనే ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రేట్లు పెంచి చేతులెత్తేశారు..

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కోకాపేట, మోకిలా, తొర్రూర్‌, బహదూర్‌పల్లి తదితర ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ భూములను ఆన్‌లైన్‌లో వేలం వేసింది. కోకాపేటలో రికార్డు స్థాయిలో ఎకరం రూ.100 కోట్లు ధర పలికింది. అప్పట్లోనే తొర్రూర్‌లో 117 ఎకరాల్లో 1000 ప్లాట్లతో హెచ్‌ఎండీఏ వెంచర్‌ వేసింది. అందులోని కొన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయి. బహదూర్‌పల్లిలో 40 ఎకరాల్లో 101 ప్లాట్లు, మోకిలలో 165 ఎకరాల్లో 1321 ప్లాట్లు వేలంలో అమ్ముడుపోయాయి. అవన్నీ కూడా భారీగా ధర పలికాయి. కానీ తొలి వాయిదా చెల్లింపు విషయంలో చాలా మంది చేతులు ఎత్తేశారు. ఈ ప్రాంతంలో ప్రైవేటు భూములు కొన్న కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే రేట్లు పెంచేందుకు ఆన్‌లైన్‌లో అధిక ధరకు కోట్‌ చేశారనే ఆరోపణలు వచ్చాయి.

ప్రస్తుతం ఈ లే అవుట్లలో 80 శాతం ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని గుర్తించి మరోసారి వేలం వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడిప్పుడే మార్కెట్‌ పుంజుకుంటోంది. పూర్తిస్థాయిలో ఊపు వచ్చాక వేలం వేస్తే మంచి డిమాండ్‌ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర నివేదికను సిద్ధం చేశారు.

Exit mobile version