స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొత్తగూడెం పట్టణం ముర్రెడు వాగు ఉధృతికి 5 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కొత్తగూడెం పట్టణం లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. చింతల చెరువు ఉప్పొంగటంతో కొత్తగూడెం హైవేపై జల ప్రవాహం సాగుతోంది. విద్యానగర్ కాలనీకి వరద ముప్పు పొంచి ఉంది.
కొత్తగూడెం ఎస్సీ కాలనీలో వరద నీటితో ఇళ్లలోకి పాములు వచ్చాయి. పెనుబల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొత్తగూడెంతో గ్రామానికి సంబంధాలు తెగిపోయాయి. లక్ష్మిదేవి పల్లి మండలంలోని సీతారంపురం వద్ద నల్లవాగు ఉధృతికి ఆటో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారు.
సుజాతనగర్ సింగభూపాలెం ప్రాజెక్టు అలుగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అలుగుపై నాలుగు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. పంట పొలాలు నీట మునిగాయి. సుజాతనగర్ మండలంలో ఎదుళ్ళ వాగు, పెద్ద వాగు, చిన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జూలూరుపాడు మండలంలో తుమ్మల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.జూలూరుపాడులోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. కాకర్ల అనంతారం మధ్య వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు రాకపోకలను నిలిపి వేశారు.
చండ్రుగొండ మండలం చండ్రుగొండ నుండి సీతాయి గూడెం వెళ్లే మార్గంలో ఎదుళ్ళ వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. చండ్రుగొండ మండలం పోకల గూడెం నుండి బాల్య తండా మధ్యలో వాగు చప్టాపై నుండి ప్రవహిస్తుండడంతో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. అన్నపురెడ్డి పల్లి మండలం అన్నపురెడ్డి పల్లి, రాజాపురం గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.