Site icon Swatantra Tv

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణ, ఏపీలో రానున్న మరో రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్లతో పాటు..మహబూబ్​నగర్‌, వనపర్తి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, సూర్యాపేట సహా..వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అటు దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి జల్లులు, రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతోపాటు.. ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మణుగూరు, సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఉపరితల గనుల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో OB పనులకు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షాలకు పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లపైకి నీరు వచ్చి చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో గత కొన్ని రోజులు భారీ వర్షాలు పడుతున్నాయి. వరదలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. V.R పురం మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని దొండపూడి, రాజంపాలెం గ్రామాలలో వరద ఉధృతి ఇంట్లోకి చేరింది. దీంతో దాదాపు పది కుటుంబాలు రాత్రి నుంచి కంటి మీద కునుకు లేకుండా గడిపారు.

Exit mobile version