ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి ముసురు వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి సహా హైదరాబాద్‌లో వానలు కురిశాయి. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో అత్యధికంగా 10.4 సెం.మీ., కౌటలలో 8.9 సెం.మీ., చింతలమానేపల్లిలో 8.6 సెం.మీ. వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3.2, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ప్రాణహిత బ్యాక్ వాటర్‌తో పంట పొలాలు మునిగిపోయాయి.
వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మారుమూల గ్రామాలకు రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. దహేగాం మండలంలో పంటపొలాల్లోకి నీరు చేరింది. బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లలోని ఓపెన్ కాస్టు గనుల్లో దాదాపు రూ.45.5 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. బొగత, కుంటాల, పొచ్చెర జలపాతాలు వరద నీటితో పరవళ్లు పెడుతున్నాయి. వర్షాల కారణంగా పర్యాటకుల సందర్శనను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.
కర్ణాటక-ఏపీ-తెలంగాణల ఉమ్మడి జలాశయం తుంగభద్ర జలాశయానికి మళ్లీ వరద పెరిగింది. తుంగ, వార్దా నదుల నుంచి ప్రవాహం పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాలను తుంగభద్ర బోర్డు అప్రమత్తం చేసింది. 91,222 క్యూసెక్కుల వరద రాగా గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పూర్తి సామర్థ్యం 105 టీఎంసీలకు ప్రస్తుతం 99.195 టీఎంసీలున్నాయి. ఇక ఎగువన ఉన్న ఆల్మట్టి జలాశయానికి 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా గేట్లు ఎత్తి యథావిధిగా విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయానికి 2.25 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదవుతుండగా.. ఇది మరింత పెరిగే అవకాశం ఉండటంతో దాన్ని 2.30 లక్షల క్యూసెక్కులకు పెంచి దిగువకు వదిలారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. గత 15 రోజులుగా వరదనీరు వచ్చి చేరడంతో శ్రీశైలం జలాశయం కళకళలాడుతుంది. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీశైలం జలాశయానికి 1లక్ష 93 వేల 803 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. అయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 853.20 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడటంతో ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆల్మట్టి నారాయణ్‌పూర్ జూరాల జలాశయాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతుంది. కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగే అవకాశాలున్నాయని శ్రీశైలం డ్యామ్ అధికారులు అంచనాలు వేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్‌కు వచ్చే వరదనీటిపై అధికారులు ఇంజనీర్లు ఎప్పటికప్పుడు నీటి నిల్వ సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారు. నాగార్జునసాగర్‌కు పైనుంచి వరద ఉధృతి లేకపోవడంతో కుడి, ఎడమ కాల్వల ద్వారా 9,447 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
ఇటు గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 17,948 క్యూసెక్కులు వస్తుండటంతో నీటిని దిగువకు విడుదల చేయడం లేదు. కడెం ప్రాజెక్టులోకి 17,557 క్యూసెక్కులు వస్తుండగా.. 14,391 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సమ్మక్క సాగర్ బ్యారేజీకి 9.75 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్‌కు 10 లక్షల క్యూసెక్కులు, మేడిగడ్డకు 7.71 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా దాంతో వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టిం 45.2 అడుగులకు నీటి మట్టం చేరింది.
భద్రాచలం వద్ద తెల్లవారుజాము వరకు తగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహం మళ్లీ స్వల్పంగా పెరుగుతుంది. గత అర్ధరాత్రి ఒంటిగంట వరకు 45.4 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 47 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఎగువన కొద్దిమేర వరద ప్రవాహం పెరుగుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి స్వల్పంగా పెరుగుతూ ప్రవహిస్తోంది. మరో అడుగు పెరిగి 48 అడుగులకు చేరుకుంటే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. మొన్నటి వరకు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేసిన తాలిపేరు ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి తగ్గడంతో 16 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.