Site icon Swatantra Tv

మంత్రులకు సీఎం రేవంత్ టార్గెట్ గా మారారా?

    సీఎంకు మంత్రుల‌కు మధ్య దూరం పెరిగిందా? ముఖ్యమంత్రిపై విప‌క్షాలు మాట‌ల దాడులు చేస్తున్నా మంత్రులు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? తాము స్పందిస్తే సీఎంకి మైలేజ్ వస్తోందని మంత్రులు భావిస్తున్నారా? లేక విప‌క్షాల మాదిరిగానే మంత్రుల‌కు రేవంత్ ప్ర‌ధాన టార్గెట్ గా మారారా? ఇంతకీ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ.

   రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షాలను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్లు ఇవ్వడంలో మంత్రులు సైతం ఫెయిల్ అవుతున్నారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఒకవైపు పార్టీ నేతలు, మరోవైపు ప్రభుత్వ నేతలు రెండు వర్గాలు ప్రతి అంశాన్ని సీఎం రేవంత్ పైనే వదిలేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. పాలన బాగానే ఉన్నా…ప్రతిరోజూ విమర్శలు ఎదుర్కోవలసి వస్తోందని పార్టీ క్యాడర్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

ప్రభుత్వ పాలనపై ప్రతిరోజూ బీజేపీ, బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు వదులుతోంది. దీనికి చెక్ పెట్టడంలో ఇటు మంత్రులు గానీ, అటు పార్టీలోకి కీలక నేతలు గానీ కౌంటర్ ఇవ్వడంలో ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు కాకముందే ఇలాంటి పరిస్థితి ఉంటే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బంది అవుతుందని క్షేత్రస్థాయి నేతలు అంటున్నారు. తమ శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా మంత్రులు తమకేమీ సంబంధం లేనట్టు సైలెంట్ గానే ఉంటున్నారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల ప్రచారంలోనూ ఇది స్పష్టంగా కనిపించిందని గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అమిత్ షా ఫేక్ వీడియో విషయంలో పార్టీ చీఫ్, ప్రభుత్వ చీఫ్ గా ఉన్న రేవంత్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చినా ఒకరిద్దరు మంత్రులు తప్పా మిగిలిన మంత్రులెవ్వరూ కనీసం స్పందించలేదు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అధికార కాంగ్రెస్ పై మాటల దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్, రుణమాఫీ, రైతుబందు, ఎరువులు, ధాన్యం కొనుగోలు, నిరుద్యోగ భృతి, పంట బోనస్ తదితర అంశాలపై ఛాన్స్ దొరికినప్పుడల్లా బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఇటు మీడియా సమావేశాలు, పబ్లిక్ మీటింగ్స్ తో పాటు అటు సోషల్ మీడియాలో సైతం ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం పడిపోతుందని, రేవంత్ పార్టీ మారతారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తోన్నా మంత్రులు, సీనియర్ నేతలు ధీటుగా స్పందించకపోవడంపై పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

   మంత్రిత్వ శాఖ‌ల‌పై విప‌క్షాలు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. సివిల్ స‌ప్లై స్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డిపై వేల కోట్ల అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ విమ‌ర్శ‌లు సాగిస్తున్నాయి. రేవంత్ టాక్స్, బ‌ట్టి టాక్స్, ఉత్తం టాక్స్ అని వ‌రుస ప్రెస్ మీట్ల‌తో కారు, కాషాయ నేత‌లు హోరెత్తిస్తున్నా. మంత్రులు మారు మాట్లాడ‌టం లేదు. విద్యుత్ కోతలు, రైతుల స‌మ‌స్య‌లు, ధాన్యం కోనుగోళ్లు, విత్త‌నాల కొర‌త ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ప‌వ‌ర్ ట్రిప్ వంటి అంశాల‌పై ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నా..ఆయా శాఖ‌ల మంత్రుల నుంచి క‌నీస స్పంద‌న లేదు. దీంతో విప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేక‌పోలేద‌ని, నిప్పు లేనిదే పొగరాదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తున్నా..తమకేమిటి అన్న‌ట్టు మంత్రుల వ్య‌వ‌హార శైలి మారినట్టు తెలుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేయడంలో వెనకడుగు వేస్తే పార్టీకి డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని పార్టీలో సీరియస్ చర్చ జరుగుతున్నట్టు సమాచారం. తాము మద్దతిస్తే రేవంత్ క్రేజ్ పెరుగుతుందని కొందరు నేతలు ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అన్ని విమ‌ర్శ‌ల‌కు రేవంతే కౌంట‌ర్ ఇచ్చుకుంటారు. తమ కెందుకు త‌లనొప్పి అన్న ధోర‌ణితో మంత్రులున్నట్టు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రులు త‌నను ఒంట‌రిని చేస్తున్నార‌ని స‌న్నిహ‌తుల వ‌ద్ద రేవంత్ వాపోతున్నట్టు సమాచారం. విప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన ప‌ని లేదు..తమ ప‌ని తాము చేసుకుంటూ పోతామ‌ని మంత్రులు అంటున్నారు. అయితే, మంత్రుల మౌన వైఖరి, తటస్థ వైఖరి రేవంత్ రెడ్డిని ఇర‌కాటంలో పెడుతోందని, దీంతో మున్ముందు ఈ సమస్య ఎక్కడికి దారి తీస్తుందో అని సగటు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఆవేదన చెందు తున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version