Site icon Swatantra Tv

సంక్రాంతి పండుగ… 14 వచ్చిందా? 15 వచ్చిందా?

Happy Pongal 2023: హిందువుల ముఖ్యమైన పండుగలో మకర సంక్రాంతి ఒకటి అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఊరూవాడా ముస్తాబవుతున్నాయి. రకరకాల రంగవల్లులతో ప్రతి ఇల్లూ శోభాయమానం అవుతోంది. అందరి ముఖాల్లో ఆనందాలు తాండవిస్తున్నాయి. పండగ మూడురోజులు ఆనందాలకు హద్దులు ఉండవు.

పంటలు సమృద్ధిగా పండి, పంట చేతికి వచ్చిన సమయం కావడంతో రైతులు ఆనందంగా చేసుకుంటారు. అంతేకాదు ఎక్కడెక్కడి నుంచో బంధువులు, కుటుంబ సభ్యులు ఏడాదికి ఒకసారి అంతా ఒకచోటికి చేరుకుంటారు. వచ్చినవాళ్లందరికీ రకరకాల పిండివంటలు ఘుమఘుమలాడుతూ ఆహ్వానిస్తుంటాయి.

ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే సంక్రాంతి పండుగ 14న చేయాలా? లేక 15న చేయాలా? అనే మీమాంశ అందరిలో మెదులుతోంది. ఇక నలుగురితో నారాయణ అనుకుంటూ ఆ ఊరిలో అందరూ ఏ రోజున చేసుకుంటే ఆరోజే చేసుకుందామనే భావనకి వచ్చేశారు.

కాకపోతే సంక్రాంతి పర్వదినాన్ని ఎలా చూస్తారని అంటే… టీటీటీ రేలంగి తంగిరాల వారి పంచాగాన్ని అనుసరించి మద్దిభట్ల శాంతారావు శర్మ సిద్ధాంతి ఇలా చెబుతున్నారు.

సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగ వస్తుంది. సూర్యుడు 14వ తేదీ రాత్రి 2.02 గంటలకు మకర రాశిలోకి ప్రవేశించాడు. మనం తెలుగు పంచాంగం ప్రకారం తిథిని పరిగణలోకి తీసుకోవాలి. అందుకని 15వ తేదీన పండుగ చేసుకోవాలి. అందువల్ల 15వ తేదీ మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. భోగీ సంక్రాంతి ముందు రోజు కావున 14 భోగీ అయ్యింది. ఆ లెక్క ప్రకారం కనుమ పండుగ 16వ తేదీ వచ్చింది.

జనవరి 15న ఉదయం నుంచి దానధర్మాలు చేస్తే మంచిదని చెబుతున్నారు. ఆ రోజంతా పితృదేవతలు, పెద్దలకు సంబంధించి కార్యక్రమాలు చేసుకోవచ్చునని అంటున్నారు.

ఇంకా చెప్పాలంటే సూర్యదేవుని ఆశీస్సుల కోసం సంక్రాంతినాడు సూర్యునికి పూజలు చేయడం మంచిదని అంటున్నారు. అలాగే బెల్లం, నువ్వులు సమర్పిస్తే ఇంకా మంచిదని చెబుతున్నారు.

అయితే పలువురు ఇలా సిద్ధాంతీకరిస్తే, తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల 14న సంక్రాంతి చేసుకుంటున్నారు. ఎక్కువమంది మాత్రం 15న సంక్రాంతి చేసుకోవడం విశేషం.

Exit mobile version