Site icon Swatantra Tv

ఓల్డ్ సిటీలో మెట్రోకు గ్రీన్ సిగ్నల్

    ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెట్రోలైన్‌కు ఇప్పటికి మోక్షం లభించింది. ఎంజీబీఎస్ నుండి ఫలక్‌నుమా వరకు 5.5కిలో మీటర్ల మేర మెట్రో మార్గానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయ నున్నారు. దీంతో ప్రస్తుతం 69 కి.మీ మొదటి దశ మెట్రో ప్రాజెక్టు.. పాతబస్తీ మార్గంతో 74కిలో మీటర్లకు విస్తరించనున్నాయి.

    ఎట్టకేలకు హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో పరుగులు తీయనుంది. త్వరలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో జేబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో రైల్ పనులు చేపట్టాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఎంజీబీఎస్ వరకే పూర్తైంది. ఇప్పుడు సీఎం శంకుస్థాపనతో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులు కారిడార్ 2 గ్రీన్ లైన్ కిందకు వస్తాయి. 2017 నుంచి హైదరాబాద్‌లో మెట్రో సేవలు ప్రారంభమైనా.. ఓల్డ్ సిటీలో 5 కిలో మీటర్ల మెట్రోకి మాత్రం ఎలాంటి ముందడుగు పడలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఓల్డ్ సిటీలో మెట్రోకు లైన్ క్లియర్ అయింది.

    మొత్తం హైదరాబాద్ నగరంలో ప్రధాన రూట్లలో మెట్రోను నడపాలని అందుకోసం మొదటి దశలో 72 కిలో మీటర్ల మేర నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అయితే గౌలిగూడ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుండి ఫలక్ నుమా వరకు ఉన్న మార్గంలో మాత్రం పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఓల్డ్ సిటి మెట్రోను పూర్తి చేయాలంటూ ఆ ప్రాంత ప్రజలు, వివిధ పార్టీలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ప్రభుత్వం ముందుకు కదిలింది.

    2018లో ఓల్డ్ సిటీలో మెట్రో పనులు ప్రారంభించాలని హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ L&T కి ఆదేశాలు జారీ చేసింది అప్పటి ప్రభుత్వం. దాంతో మెట్రో పనులు చేపట్టేందుకు పిల్లర్ల ఫౌండెషన్ పనులకు మార్కింగ్ కూడా చేశారు. అయితే అక్కడ ఆస్తుల సేకరణ చాలా సంక్లిష్టంగా మారడంతో పనులు ముందుకు సాగలేదు. సుమారు 1000కు పైగా ఆస్తుల సేకరణ, 103కు పైగా మత సంబంధమైన ప్రార్థనా స్థలాలకు ఇబ్బంది కలుగకుండా మెట్రో పనులు చేపట్టేం దుకు అవసరమైన రైట్‌ఆఫ్‌వే స్థలాన్ని సేకరించడం అప్పట్లో అదికారులకు కత్తిమీదసాములా మారింది. దాంతో ఓల్డ్ సిటీలో మెట్రో పనులను చేపట్టేందుకు నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టి విముఖంగా ఉన్నట్లు అప్పట్లో చర్చజరిగింది.

    ఓల్డ్ సిటీ మార్గంలో సాలార్‌జంగ్‌మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషీర్‌గంజ్‌, ఫలక్‌నుమా ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లను నిర్మించే ప్రణాళికలు సిద్ధం చేశారు. గతంలో ఎంజీబీఎస్, ఫలక్ నుమా మార్గంలో మెట్రో నిర్మాణానికి ఆస్తులు సేకరించాలంటే దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అధికార వర్గాలు అంచనా వేశాయి. ప్రతి కిలో మీటర్ మార్గానికి దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనాకు వచ్చారు. అయితే ఇప్పుడు ఆ ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ మార్గం పనులపై మెట్రో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఎంత ఖర్చు అవుతుంది..? ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే అంశం తేలాల్సి ఉంది.

Exit mobile version