Site icon Swatantra Tv

వైసీపీకి గుడ్ బై – మంత్రి గుమ్మనూరు

    కారణాలు ఏవైనా..వైసీపీకి కొందరు బీసీ నేతలు దూరం అవుతున్నారు. ఇప్పటికే ఒక ఎంపీ, ఓ ఎమ్మెల్యే పార్టీని వీడగా, తాజాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో మంత్రి వైసీపీకి రాజీనామా చేశారు. కర్నూలు జిల్లాలో ఆయన కీలక నేతగా పేరొందారు.

   వైసిపి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకటి తెలిస్తే పార్టీ నేతలు మాత్రం మరోలా ప్రవర్తిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పార్టీ అభ్యర్థుల మార్పులు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, పార్టీ విజయావకాశాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత పార్టీ అధిష్ఠానానికి వచ్చింది. దీంతో, ఆ దిశగా పార్టీ అధినేత జగన్ అడుగులు ముందుకేస్తుంటే, కొందరు నేతలు అలక వహించి పార్టీని వీడుతున్నారు.

   కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరామ్ ను వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని సీఎం జగన్ కోరారు. అయితే, కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడని జయరాం వైసీపీ నుంచి తొలగుతున్నట్టు తెలిపారు. జగన్ క్యాబినెట్లో ఐదేళ్లపాటు మంత్రిగా కొనసాగిన గుమ్మనూరు జయరాం ఇప్పుడు రాజీనామా చేయటంతో వైసీపీకి కొంత షాక్ తగిలినట్టయ్యింది. గుమ్మనూరు వైసీపీని వీడడంతో బోయ సామాజిక వర్గం పార్టీకి దూరం అవుతుందేమో అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

       గతంలో కర్నూలు ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ సైతం వైసీపీకి రాజీనామా చేశారు . గత ఎన్నికల్లో సంజీవ్ కుమార్ ని ఏరి కోరి వైసిపి అధిష్ఠానం కర్నూలు ఎంపీగా పోటీ చేయించింది. బీసీ చేనేత సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో సంజీవ్ కుమార్ కి పిలిచి మరి వైసిపి టికెట్ ఇచ్చింది. అయితే, వచ్చే ఎన్నికల్లో ఏవో కారణాల వల్ల ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయింది. టికెట్ రాకపోవంతో…ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్ఠానం మాజీ ఎంపీ బుట్టా రేణుక కు ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఈ కారణంగా చేనేత సామాజిక వర్గం ఓట్లకు గండిపడవనే వైసీపీ భావిస్తోంది. పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి పార్టీని వీడారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన పార్థసారధికి యాదవ సామాజిక వర్గంలో అభిమానులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్థసారథి కి పెనమలూరు టికెట్ దక్కలేదు. దీంతో, ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో, బిసి సామాజిక వర్గ నేత గంజి చిరంజీవికి కి సీఎం జగన్ పెద్ద పీట వేశారు. అసెంబ్లీ ఇంఛార్జి బాధ్యతలు ఆయనకు అప్పగించారు. అనంతరం వివిధ కారణాల వల్ల ఆయనను తప్పించారు.

      పడవ దాటే వరకు ఓడ మల్లయ్య అని ప్రయాణం పూర్తయ్యాక బోడి మల్లయ్య అన్నాడు ఓ కుసంస్కారి. పార్టీ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు కంటే పదవులే ప్రధానం అనే నేతలు అధికమవ్వడం శోచనీ యం. పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించి, వేల మైళ్లు పాదయాత్రలు చేసి…విపక్షాలను మట్టి గరిపించి పాలనా పగ్గాలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ పైనా, వైసీపీ పైనా కొందరు నేతలు ఈరీతిన ప్రవర్తించడం ఏం సబబని కొందరు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బలమవు తున్న ప్రత్యర్థి పార్టీని ఎదుర్కోవడానికి, వచ్చే ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి రావడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం పార్టీ అధిష్ఠానానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొందరిని ఎంపీలుగా పోటీ చేయమని కోరుతున్నారు, కొందరికి వేరే నియోజకవర్గాలు కేటాయించి పోటీ చేయమంటున్నారు. ఏ ఒక్కరిని బహిష్కరించడం లేదు, ఏ వేటు వేయడం లేదు. పార్టీ విజయావకాశాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు, చేర్పులు చేస్తుంటే అవకాశవాదులుగా మారి పార్టీని వీడడం సమంజసమేనా..? ఇప్పటివరకు ఎన్నో గొప్ప పదవులు అందజేసిన పార్టీ అధినేతపై ఈ రీతిన అవిధేయత ప్రదర్శించడం ఎంత అనుచితం.. అని పార్టీశ్రేణులు ఆవేదన చెందుతున్నాయి.

Exit mobile version