Site icon Swatantra Tv

రేపు ఏపీ అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్‌

ఏపీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. రేపు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్దికి అధికా ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సిఎం చంద్రబాబు ఛాంబర్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగబోతుంది. బడ్జెట్‌ను మంత్రి వర్గం ఆమోదించిన తర్వాత అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక బడ్జెట్ అనంతరం అసెంబ్లీ లో వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. అలాగే శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.

టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుంది.

పూర్తిస్థాయి ఏపీ బడ్జెట్‌ రూ.3.25 లక్షల కోట్ల అంచనాలతో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వ్యవసాయ బడ్జెట్‌ రూ. 500వేల కోట్లు ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. అభివృద్ధికి నిధులు కేటాయిస్తూనే సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది.

సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ప్రభుత్వ హామీల అమలు దిశగా తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15వేల చొప్పున ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుంది. ఇందుకు సుమారు రూ.10, 300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం కోసం రాష్ట్రంలో 53.58 లక్షల మంది రైతులు అర్హులుగా తేల్చారు. వీరందరికీ రూ.20వేలు చొప్పున చెల్లించాలంటే మొత్తం రూ.10,717 కోట్లు అవసరమని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Exit mobile version