విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ సాయిబాబాకు మాజీ మంత్రి హరీశ్‌రావు నివాళులర్పించారు. మౌలాలిలోని ఆయన నివాసానికి చేరుకున్న హరీశ్‌రావు.. సాయిబాబా పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. హరీశ్‌రావుతోపాటు మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్ నాయక్, పార్టీ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, తుల ఉమ, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి.. సాయిబాబా భౌతిక కాయానికి నివాళులర్పించారు.
సాయిబాబా మృతి బాధాకరమని చెప్పారు. సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపి నిర్ధోషిగా బయటికి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఇలా జరగడం శోచనీయమని హరీశ్ రావు అన్నారు. దశాబ్ద కాలంపాటు ఆయనతోపాటు కుటుంబ సభ్యులు పడిన వేదన వర్ణనాతీతం అని తెలిపారు. ఆయన పడిన వేదనకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అంగవైకల్యం ఉన్న వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం బాధాకరమన్నారు. సాయిబాబా మృతికి కేంద్రం బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. సాయిబాబాపై కేంద్రం అణచివేత ధోరణితో వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.