సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని, రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన నడుస్తోందని అన్నారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం ముందుగా మేలుకుంటే ప్రాణనష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేదని తెలిపారు. వరద బాధితులకు సాయం చేయడానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వెళ్తే దాడి చేసి కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.