Site icon Swatantra Tv

ఏపీ కూటమిలో లుకలుకలు

ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల పర్వం దాదాపు చివరకు చేరింది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీలో సీట్ల కేటాయింపు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఎవరికి టికెట్ కేటాయించాలనే దానిపై తెలుగుదేశం పార్టీలో తర్జనభర్జనలు కొనసాగుతు న్నాయి. మొత్తం ఐదు అసెంబ్లీ సీట్లపై రగడ కొనసాగుతుంది. ఇందులో అనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్ అంశం ప్రధానమైనది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ సీటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అనపర్తి నుంచి బీజేపీ టికెట్‌పై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయడానికి రంగం సిద్ధమైంది.

వాస్తవానికి అనపర్తి సీటు నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని మొదట భావించింది. అయితే కూటమి పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించిన అనపర్తి సీటును తిరిగి తెలుగుదేశం పార్టీకి కేటాయించడానికి బీజేపీ హై కమాండ్ అంగీకరించలేదు. అనపర్తిని టీడీపీ కోసం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు.ఈ నేపథ్యంలో బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకోవాల్సిందిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పై ఒత్తిడి వచ్చింది. అయితే రోజులు గడిచేకొద్దీ ఈ ఒత్తిడి మరింతగా పెరిగింది. దీంతో ఎన్డీయే కూటమి రాజకీయాల్లో అనపర్తి నియోజకవర్గం ఎవరిది ? అనేది హాట్‌టాపిక్ గా మారింది.అనపర్తి అంశం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. దీనిపై చర్చలు జరుగు తున్నా , వివాదం ఒక కొలిక్కి రావడానికి సమయం పట్టింది. దీంతో ఇటు బీజేపీ అటు టీడీపీ మధ్య అనపర్తి సీటుపై పెద్ద రగడ చోటు చేసుకుంది.

అనపర్తి వివాదంలో ఒక దశలో బీజేపీ హస్తిన పెద్దలు కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అనపర్తిలో టీడీపీయే పోటీ చేస్తుందని చంద్రబాబు ధీమాగా చెప్పారు. అయితే అనపర్తిని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి బీజేపీ హస్తిన పెద్దలు అంగీకరించలేదు. అనపర్తి వివాదం పెద్దది కావడంతో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నల్లమిల్లిని సముదాయించారు. దీంతో బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ టికెట్‌ పై అనపర్తి నుంచి పోటీ చేయడానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకరించారు. అంతిమంగా తెలుగుదేశం పార్టీ నాయకుడైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ బీ ఫాంపై అనపర్తి నుంచి బరిలో దిగడానికి రంగం సిద్దమైంది.

వాస్తవానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో బాగంగా 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్ధులను ప్రకటించింది. అయితే, కొంతమంది నేతలకు టికెట్లు లభించలేదు. దీంతో చాలాచోట్ల అసమ్మతి జ్వాలలు ఎగసిపడ్డాయి. టీడీపీలో ఉవ్వెత్తున ఎగసిన అసమ్మతిని నివారించడానికి తాజాగా ఐదు చోట్ల అభ్యర్థులను మార్చారు చంద్రబాబు నాయుడు. ఉండి, పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామ కృష్ణరాజుకు అవకాశం కల్పించారు. ఆయనతో పాటు పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మాడుగుల – బండారు సత్యనారాయణమూర్తి, మడకశిర – ఎంఎస్ రాజు, వెంకటగిరి – కురుగొండ్ల రామకృష్ణలకు టికెట్లు ఖరారు చేశారు.

రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ కేటాయించిన నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును.. నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. అయితే ఇప్పటివరకూ అక్కడ పార్లమెంట్ అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిట్‌ బ్యూరోలోకి తీసుకున్నారు. అటు, పెందుర్తి సీటును మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆశించారు. కానీ పెందుర్తి సీటును జనసేనకు కేటాయించిన నేపథ్యంలో బండారు సత్యనారాయణ మూర్తికి మాడుగుల స్థానాన్ని కేటాయించారు. ఇక పాడేరు టికెట్‌ను గతంలో వెంకట రమేశ్ నాయుడుకు కేటాయించగా.. మార్పుల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి కేటాయించారు. మరోవైపు మడకశిర నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు టికెట్‌ ఇచ్చారు. వెంకటగిరి స్థానాన్ని ఇదివరకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు. అయితే, మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణనే అభ్యర్థిగా బరిలో నిలిపారు.

  ఇదిలా ఉంటే అభ్యర్థులను మార్చడంపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. మడకశిర టీడీపీ అభ్యర్థిగా సునీల్‌ కుమార్‌ను తప్పించి.. MS రాజు పేరు ఖరారు చేయడం తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడలేదు. దీంతో అధిష్టానం తీరుపై మండిపడ్డారు.లోకల్‌ ముద్దు..నాన్‌లోకల్‌ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అటు అల్లూరు జిల్లా రంపచోడవరంలో టీడీపీ రెబల్‌ అభ్యర్థి వంతల రాజేశ్వరి మరో ట్విస్ట్‌ ఇచ్చారు. రెబెల్‌గా తాను పోటీ చేస్తున్నా, చంద్రబాబు ఫొటోతోనే ప్రచారం చేస్తానన్నారు. నియోజక వర్గంలో అనంతబాబు ఆరాచకాలను ఎండగడతానన్నారు. ప్రజల్లో ఉన్న తనను పార్టీ హైకమాండ్‌ గుర్తించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కార్యకర్తల అభ్యర్థన మేరకే తాను రెబల్‌గా బరిలో దిగానని స్పష్టం చేశారు వంతల రాజేశ్వరి .మొత్తానికి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది తెలుగుదేశం పార్టీ. రాబోయే రోజుల్లో ప్రచారాన్ని మరింత పరుగులు పెట్టేలా ప్లాన్ చేస్తోంది. అయితే రెబెల్స్ బెడదతో పాటు పార్టీలో అసంతృప్తిని ఎలా దారికితెస్తారు అనేది వేచి చూడాల్సిందే.

Exit mobile version