Site icon Swatantra Tv

నియంత నిష్క్రమణ

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహిం రైసీ మరణ వార్త ప్రపంచాన్ని దిగ్భ్రమ పరచింది. ప్రెసిడెంట్ తో పాటు విదేశాంగమంత్రి హుస్సేన్ అమిర్ అబ్దొల్లాహిన్ , ఈస్ట్ అజర్ బైజాన్ గవర్నర్ మలేక్ రహ్మతి , పలువురు ఇతరులు ఈ ప్రమాదంలో మరణించారు. దీంతో ఇరాన్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరో నియంత శకం ముగిసింది. 1988 మారణహోమంలో దాదాపు 30 వేల మంది రాజకీయ ఖైదీల మరణాలకు ప్రత్యక్షసాక్షి రైసీ.

ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహిం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాన్ని ఢీకొని పూర్తిగా దగ్ధమైంది. ఇరాన్ అధ్యక్షుడు రైసీ, విదేశాంగ మంత్రి తదితరులు మృతి చెందారు. దీంతో ఇరాన్ లో మరో నియంత శకం ముగిసింది. ఇరాన్ షా తర్వాత మరో అంతటి నియంతగా రైసీ పేరు పొందారు. రాజకీయ ప్రత్యర్థులపై ఉక్కుపాదం మోపి అణచివేయడమే కాదు.. హిజాబ్ కు వ్యతిరేకంగా ఉద్యమించిన మహిళలను నిర్దాక్షిణ్యంగా అణచివేసిన దారుణమైన అధ్యక్షుడుగా, మత చాందస వాదిగా అపప్రద పాలయ్యాడు.

ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహిం రైసీ 1960 డిసెంబర్ 14న ఇరాన్ లోని మస్హద్ లో జన్మించారు. తన 15వ యేట ప్రసిద్ధ కోమ్ మత సెమినరీలో చదువుకోవడం ప్రారంభించాడు. ఆనాటి ముస్లిం పండితుల వద్ద విద్యాభ్యాసం చేశారు. 20 ఏళ్ల ప్రాయంలోనే తెహరాన్ చేరుకుని డిప్యూటీ ప్రాసిక్యూటర్ గా కెరియర్ ప్రారంభించి ప్రాసిక్యూటర్ గా ఎదిగారు. 1983లో ఇమామ్ అహ్మద్ అలమోల్హోదా కుమార్తెను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. 1988 లో ప్రాసిక్యూటర్ గా రైసీ రాజకీయ ఖైదీల వరుస మరణశిక్షలను పర్యవేక్షించే కమిటీలో భాగంగా ఉన్నారు. దీంతో ఇరాన్ ప్రతిపక్షాలలో ఆయనకు ప్రజాదరణ లేకుండా పోయింది. అదే సమయంలో అమెరికా ఆయనపై ఆంక్షలు విధించింది 1989 లో, ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ అయతుల్లా రుహొల్లా ఖొమేనీ మరణం తరువాత అతను టెహ్రాన్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు.

రైసీమతపరమైన సాంప్రదాయ రాజకీయ వేత్తగా పేరు పొందారు. న్యాయవ్యవస్థ, మత ఉన్నత వర్గాలతో లోతైన సంబంధాలు కలిగిన వ్యక్తి కావడంతో 2019 – 2021 వరకు ఇరాన్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2017 లోనే అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన రైసీ 2021లో ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఇబ్రహిం రైసీ పదవీ కాలంలోనే రాజకీయ ప్రత్యర్థులను దారుణంగా అణచి వేశారు. దీంతో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై కొత్తగా ఆర్థిక ఆంక్షలు విధించారు. దీంతో ఇరాన్ కుదేలైంది. కోవిడ్-19 మహమ్మారి తో ఇరాన్ లోనూ పరిస్థితిని మరింత దిగజార్చింది, ఆగస్టు 2021 నాటికి ఇరాన్ లో కోవిడ్ -19 కారణంగా 97వేల మంది మరణించారు. కరడుగట్టిన మత ఛాందసవాది అయిన రైసీ వ్యవస్థలో మత స్థాపన కోసం గట్టి కృషిచేశారు. దివంగత ఖొమేని, ఆయన వారసుడు ఖమేనీతో బలమైన సంబంధాలు ఉండడంతో తన అధికారాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ప్రభుత్వ సైనిక, శాసన పరమైన శాఖలన్నింటిపైనా బలమైన పట్టు బిగించారు.

2022 చివరిలో, హిజాబ్, దుస్తులు సక్రమంగా ధరించలేదన్న సాకుతో ఇరాన్ మోరాలిటీ పోలీసులు మహ్సా అమిని అనే మహిళను నిర్బంధించారు.టెహ్రాన్ లోని మెట్రో స్టేషన్ నుండి బయలుదేరిన 22 ఏళ్ల ఆ యువతిని అరెస్టు చేశారు. ఆమె లాకప్ డెత్ పై ప్రజాల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఇరాన్ మహి ళలు రోడ్డెక్కారు. ఇరాన్ మహిళలు తమ హిజాబ్ లను తొలగించి నిరసన తెలిపారు. హిజాబ్ లను తగులపెట్టారు. జుట్టును కత్తిరించుకుని నిరసన తెలిపారు. నిరసనలను ఇరాన్ ప్రభుత్వం పోలీసులు ఉక్కుపాదంతో అణచివేశారు. మహిళలను ఊచకోతకోశారు. దాదాపు 500 మంది మరణించడంతో ర్యాలీలు ముగిశాయని విదేశీ మానవ హక్కుల సంస్థలు తెలిపాయి. అల్లర్లలో పాత్ర పోషించిన ఏడుగురికి ఉరిశిక్ష విధించారు.

మహిళల అణచివేతలో ఇరాన్ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని, హత్య, చిత్రహింసలు, అత్యాచారాలతో సహా నేరాలకు పాల్పడిందని ఐక్యరాజ్యసమితి నిజనిర్ధారణ మిషన్ ఈ ఏడాది మార్చిలో తేల్చింది. అమెరికా వైఖరిపట్ల ఆగ్రహంతో రైసీ ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమం చేపడుతుందని ప్రకటించారు. ఇజ్రాయెల్ గాజా పై దాడులకు నిరసనగా ఇరాన్ ఆదేశంతో తెగతెంపులు చేసుకోవడమే కాదు. ఇజ్రాయెల్ పై దాడులకు తెగపడింది. 120 బాలిస్టిక్ మిస్సైళ్లు, 170 డ్రోన్లు, 30 పైగా క్రూయెజ్ మిస్సైళ్లతో దాడి కి పాల్పడింది. తన మత ఛాందసవాదం, నియంతృత్వ ధోరణులతో అంతర్జాతీయంగా కొత్త ఘర్షణలకు శ్రీకారం చుట్టడం ద్వారా రైసీ వివాదాస్పద ప్రెసిడెంట్ గా చరిత్రలో నిలిచి పోడాడు. రైసీ మరణవార్త తెలిసిన వెంటనే ఇరాన్ కేబినెట్ అత్యవసరంగా సమావేశమై, తక్షణ కర్తవ్యంపై చర్చించింది. ఇరాన్ రాజ్యాంగం ఆర్టికల్ 131 ప్రకారం అధ్యక్షుడు మరణించినట్లయితే, మొదటి వైస్ ప్రెసిడెంట్ పదవిని స్వీకరిస్తారు. అధ్యక్షుడు మరణించినట్లు ప్రకటించిన రోజు నుంచి ఆయన కొత్త అధ్యక్ష ఎన్నికలకు సన్నాహాలు చేయాల్సి ఉంటుంది. రైసీ స్థానే ఉపాధ్యక్షుడు మహ్మద్ మొఖ్బర్ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఉంది.

Exit mobile version