స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సినీ నటి కరాటే కల్యాణిని ‘మా’ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. ‘మా’ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు కళ్యాణిపై చర్యలు తీసుకుంటూ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సస్పెన్షన్‌పై ఆమె స్పందించారు. తాను ఏం తప్పుచేశానో అర్థం కావడం లేదన్నారు. తాను ఎన్టీఆర్‌కు వ్యతిరేకం కాదని.. కృష్ణుడి రూపంలో ఆయన విగ్రహం పెడితే సమాజంలోకి తప్పుగా వెళ్తుందని తెలిపారు. ప్రతి హీరోకి దేవుడి రూపంలో విగ్రహం పెడితే దేవుళ్లు ఇంకెందుకని ప్రశ్నించారు. విగ్రహ ఏర్పాటును ఆపాలి అని అడిగినందుకు సస్పెండ్ చేశారని పేర్కొన్నారు.
కాగా మే 28న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఖమ్మంలోని లకారం చెరువులో శ్రీ కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటును కరాటే కల్యాణి తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా తెలంగాణ హైకోర్టు కూడా విగ్రహ ఏర్పాటు ఆపండని ఆదేశాలు ఇవ్వడంపైనా ఆమె హర్షం వ్యక్తంచేశారు. దీంతో కల్యాణిపై ‘మా’ అసోసియేషన్ సీరియస్ అయింది. తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన ఎన్టీఆర్‌పై ఆ విధమైన వ్యాఖ్యలు ఎందుకు చేశారో వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసు పంపింది. ఈ నోటీసుపై గడువులోపు వివరణ ఇవ్వకపోగా.. ‘మా’కు లీగల్ నోటీసు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అసోసియేషన్ ఆమెను సస్పెండ్ చేసింది.